పిజ్జా - బ‌ర్గ‌ర్ ల ప్లేస్ లో ఇడ్లీ - దోశెలు

Update: 2018-09-29 11:21 GMT
భార‌త ఉప రాష్ట్ర‌ప‌తికి తెలుగు భాష‌న్నా....భార‌తీయ సంస్కృతీసంప్ర‌దాయాల‌న్నా మ‌క్కువ ఎక్కువ‌న్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వాడి ఖ్యాతిని జాతీయ‌ స్థాయికి తీసుకువెళ్లిన వెంక‌య్య‌....ఇప్ప‌టికీ పంచెక‌ట్టులో అచ్చ‌ తెలుగు ద‌నానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగుతున్నారు. తాజాగా గోవాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వెంక‌య్య‌...భార‌తీయ సంప్ర‌దాయ వంట‌కాల గురించి ప్ర‌సంగించారు. భారతీయ వంటకాలకు ఘన చరిత్ర ఉందనీ - వాటి ముందు పాశ్చాత్య వంటకాలు దిగ‌దుడుపేన‌ని వెంక‌య్య అన్నారు. భార‌తీయులకు ప్రీతి పాత్ర‌మైన ఇడ్లీ - దోశెలకు ఇపుడు  ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉంద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే పిజ్జా - బర్గర్ల స్థానాన్ని....ఇడ్లీ - దోశెలు ఆక్ర‌మిస్తాయ‌ని అన్నారు. గోవాలోని ఎన్ ఐటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్ర‌సంగించిన వెంక‌య్య‌....అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
 
ఎన్నో ఏళ్లుగా భార‌తీయ వంట‌కాలు కాలపరీక్షను ఎదుర్కొని నిల‌బ‌డ్డాయ‌ని వెంక‌య్య అన్నారు. ప్ర‌స్తుతం మ‌న వంట‌కాలు అంతర్జాతీయ సమాజం నోరూరిస్తున్నాయ‌ని అన్ఆన‌రు. మ‌న‌ ఇడ్లీ - మ‌న సాంబార్ - మ‌న‌ దోశె పాపుల‌ర్ అవుతున్నాయ‌ని - రాబోయే కాలంలో పిజ్జాలు - దోశెలు వీటి ముందు నిలబడ‌లేవ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గోవా చేపల కూర అద్భుతంగా ఉంటుంద‌ని - ఒక్క‌సారి ఆ చేపలకూర రుచి చూసిన వారు  మళ్లీ మళ్లీ తింటార‌ని అన్నారు. ఏళ్లు గ‌డ‌చినా...ఇడ్లీ - దోశె - చేప‌ల కూర‌...వీటిలో మార్పులు రాలేద‌న్నారు. పురాతన సంస్కృతీ సంప్రదాయాలకు భారతదేశం నెల‌వ‌ని, ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన సంస్కృతి భార‌త్ సొంత‌మ‌ని అన్నారు. రోమ్ - ఈజిప్టు - గ్రీక్ సహా ఇంకా ప్రపంచంలో అనేక సంస్కృతులున్నాయ‌ని, కానీ ప్ర‌స్తుతం వాటిలో మార్పులు వ‌చ్చాయ‌ని చెప్పారు. కానీ, భారత సంస్కృతి మాత్రం... అప్ప‌టికీ...ఇప్ప‌టికీ అలాగే ఉంద‌న్నారు. వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని భార‌త్ విశ్వసిస్తుంద‌ని, అందుకే సంస్కృతీ సంప్ర‌దాయాలను కొన‌సాగిస్తూ అత్యంత‌ శక్తివంతమైన దేశంగా నిలబడగలిగిందని వెంక‌య్య కొనియాడారు.
   

Tags:    

Similar News