అక్బరుద్దీన్ వచ్చి కేసీఆర్ కు చేసిన రిక్వెస్టులు ఏమంటే?

Update: 2020-02-10 07:00 GMT
మిత్రుడు కమ్ తనకు అత్యంత ఆప్తుడైన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ స్వయంగా తన వద్దకు వచ్చి కోరికలు కోరితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాదనలేరు కదా? తాజాగా అలానే జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేరుగా ఆయన ఇంటికి వచ్చి కలిసి.. వినతి పత్రాలు ఇచ్చిన వైనం గతంలో ఎప్పుడూ చోటు చేసుకో లేదు. దీనికి భిన్నంగా తాజాగా ప్రగతి భవన్ కు వచ్చారు అక్బరుద్దీన్.

సాధారణంగా మజ్లిస్ అధినేత.. ఆయన సోదరుడు నోరు విప్పితే చాలు.. మైనార్టీల సంక్షేమం.. వారి బాధలు.. వేదనల గురించి మాట్లాడతారే కానీ.. తమ ఇలాకాలో బతికే హిందువుల గురించి.. వారికి సంబంధించిన సమస్యల గురించి పెద్దగా ప్రస్తావించరన్న విమర్శ ఉంది. దీనికి చెక్ చెప్పేలా తాజాగా ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

పాతబస్తీలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నప్పటికీ.. ఈ గుడి మాత్రం కేవలం వంద గజాల ప్రాంగణలోనే ఉంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో నిర్వహించే బోనాలు దేశ వ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. సదరు గుడిని రూ.10 కోట్ల వ్యయం తో విస్తరించి.. డెవలప్ చేయాలని కోరారు.

దేవాలయాన్ని విస్తరించిన పక్షంలో.. దాని పక్కనే ఉండే వారి ఆస్తులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి.. వారికి ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయాల్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదే సమయంలో పాతబస్తీలోని అప్జల్ గంజ్ లోని మసీదు మరమ్మత్తుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఇలా తన వద్దకు వచ్చిన నోరు విప్పి కోరికలు కోరిన అక్బరుద్దీన్ డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటమే కాదు.. ఆ వెంటనే రెండు ప్రార్థనా మందిరాల డెవలప్ మెంట్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఇదే మీటింగ్ లో మెట్రోను పాతబస్తీ కి తీసుకు రావాలన్న విషయాన్ని కేసీఆర్ ముందు పెట్టగా.. దానికి ఆయన ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మెట్రో అధికారులతో కలిసి.. పాతబస్తీ కి మెట్రోకు తీసుకొచ్చే అంశంపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు గా తెలుస్తోంది. మొత్తానికి తన స్నేహితుడి సోదరుడికి సారు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే.. వారి మధ్య బంధం ఎంత బలమైనదో ఇట్టే అర్థమై పోతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News