బీజేపీ ఓడితే.. పార్టీ ఇక బందేనా? పొలిటిక‌ల్ డిబేట్‌

Update: 2022-10-07 08:04 GMT
మ‌నుట‌యా.. మ‌ర‌ణించుట‌యా.. అన్న‌ట్టు బీజేపీ నేత‌లు భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక‌లో ఆ పార్టీ గెలిచే ప‌రిస్థితి ఎంత‌?  ఆ పార్టీ అప్ర‌క‌టిత అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి(ఇంకా ప్ర‌క‌టించ‌లేదు) దూకుడు ఎంత‌?  పార్టీ గెలిస్తే.. ఇప్పుడున్న ముగ్గురికి మ‌రొక ఎమ్మెల్యే తోడ‌వుతాడు.. అంత‌కుమించి.. ఏమీ కాదు. అలా కాకుండా.. ఒక‌వేళ  కోమ‌టిరెడ్డి ఓడిపోతే.. వ్య‌క్తిగ‌తంగా కోమ‌టిరెడ్డికి పోయేది ఏమీ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కానీ, కోమ‌టిరెడ్డి వంటి నాయ‌కుడిని అప్ప‌టిక‌ప్పుడు తీసుకుని.. టికెట్ ఇచ్చి..గెలిపించుకోలేక పోతే.. బీజేపీనే భ్ర‌ష్టు ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దుబ్బాక‌, హుజూరాబాద్‌ల‌లోగెలుపును చూసి.. బ‌లుపుగా.. బీజేపీ భావిస్తోంద‌నే వాద‌న కొన్నాళ్లుగా ఉండ‌నే ఉంది. అయితే..అది సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో తేలిపోయింది. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి?  మునుగోడులో బీజేపీకి గెలిచే స‌త్తా ఉందా?  పోనీ.. అభ్య‌ర్థి పై ఆధార‌ప‌డినా.. గెలుపు సాధ్య‌మేనా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను బ‌ట్టి.. మునుగోడుపై రాజ‌గోపాల్ రెడ్డి ప‌ట్టు అంతంత మాత్ర‌మే. గ‌త 2018లో కేవ‌లం ఆయ‌న 23 వేల ఓట్ల తేడాతో విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. త‌ర్వాత‌..ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. క‌రోనా స‌మయంలోనూ ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గా నికి దూరంగానే ఉన్నారు.  దీంతో అనుకున్న రేంజ్‌లో కోమ‌టిరెడ్డికి ఇక్కడ ఫాలోయింగ్ లేద‌నే చెప్పాలి. అయితే.. ఆయ‌న సామాజిక‌వ ర్గం ప‌రంగా..కొంత  వ‌ర‌కు ఫాలోయింగ్ ఉంది.

కానీ, ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌స్తే.. ఆ వ‌ర్గం ఆయ‌న వెంట ఎంత మేర‌కు ఉంటుంద‌నేది చెప్ప‌లేని ప‌రిస్థితి గ‌త ఎన్నిక‌ల‌ప్పుడు.. కాంగ్రెస్ అదికారంలోకి వ‌స్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీంతో కాంగ్రెస్ వైపు ఇక్క‌డి ప్ర‌జ‌లు మొగ్గు చూపారు. ఈ క్ర‌మంలోనే తొలిసారి ఇక్క‌డ నుంచి పోటీ చేసినా.. కోమ‌టిరెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఇప్పుడు.. ఆయ‌న బీజేపీలో ఉన్నారు. బీజేపీ విష‌యంపై రెండు కీల‌క అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

బీజేపీ వ‌ల్ల రాష్ట్రానికి ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం ఏంట‌నేది ప్ర‌శ్న‌. రెండు.. బీజేపీ వ‌స్తే.. మ‌త‌క‌ల‌హాలు పెరుగుతాయ‌నే భ‌యాందోళ‌న‌లు ఉన్నాయి. ఈ రెంటి విష‌యంలోనూ బీజేపీ స‌మాధానం చెప్పాలి. అయితే..చెప్ప‌డానికి బీజేపీ వ‌ద్ద స‌రుకు లేదు. ఈ నేప‌థ్యంలోనే.. బీజేపీని చూసి వోట్లు వేసే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగి.. కోమ‌టిరెడ్డి ఓడిపోయినా.. ఏమీకాదుకానీ, బీజేపీ పుట్టిమాత్రం మునిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News