బడ్జెట్ లో కేసీఆర్ 'ప్రచార' ఖర్చు లెక్క తెలిస్తే నోట మాట రాదంతే..

Update: 2023-02-08 10:16 GMT
తాము చేసే పనుల్ని సమర్థించుకోవటం రాజకీయ నేతలకు మామూలే. అయితే.. వీళ్లందరికి పెద్దన్నలా ఉంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్. సాధారణంగా రాజకీయ అధినేతలు నీళ్లు నమిలే ప్రశ్నలకు.. ఈ తండ్రికొడుకులు మాత్రం అందుకు భిన్నంగా చెలరేగిపోతారు. వారసత్వ రాజకీయాలు.. కుటుంబ పాలన అన్న విపక్షాల విమర్శలకు రాజకీయ అధినేతల కుటుంబాలు కాస్తంత కలవరపాటుకు గురి అవుతుంటారు. అందుకు భిన్నంగా మంత్రి కేటీఆర్.. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణలోని కోట్లాది ప్రజలంతా తమ కుటుంబమేనని.. తమది కుటుంబ పాలనే అని తేల్చేయటమే కాదు.. బరావర్ మాది కుటుంబ పాలనే అని స్పష్టం చేశారు.

ఇలా తాము చేసే పనుల్ని గొప్పగా సమర్థించుకునే టాలెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. మంత్రి కేటీఆర్ కు దండిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తమ మాటల టాలెంట్ తో తిమ్మిని బమ్మిని చేస్తుంటారన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోతుల్లోకి వెళ్లినప్పుడు.. సరికొత్త పద్దుల లెక్కలు కనిపిస్తున్నాయి. వాటిల్లోకి వెళితే..కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.

గత బడ్జెట్ లో సర్కారు విజయాల్ని ప్రచారం చేయటం కోసం కొద్దిమేర నిధులు మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ ప్రచార కార్యకలాపాల్ని పర్యవేక్షించేందుకు వీలుగా సమాచార, పౌరసంబంధాల శాఖ ఒకటి ఉండటం తెలిసిందే.  ఈ శాఖకు సంబంధించిన అధికారుల జీతభత్యాలతో పాటు ప్రభుత్వ ప్రచారం కోసం కొద్దిపాటి నిధుల్ని కేటాయిస్తుంటారు. ఉదాహరణకు గత ఏడాది సంగతే తీసుకుంటే.. రూ.148 కోట్లు కేటాయించారు.

మరి.. ఎన్నికల ఏడాది కావటం, ఇంతకాలం ప్రాంతీయ పార్టీగా ఉండి ఈ మధ్యనే జాతీయ పార్టీగా మారిన వేళ.. దేశ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ విజయాల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటానికి వీలుగా భారీ ఎత్తున ప్రభుత్వ నిధులను కేటాయించిన తీరు నమ్మశక్యం కాని రీతిలో ఉందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రాష్ట్రానికి వెళితే.. ఆ రాష్ట్రంలో స్థానిక పత్రికలకు.. చానళ్లకు కోట్లాది రూపాయిల ప్రకటనలు గుప్పించే అలవాటున్న కేసీఆర్.. తాజా బడ్జెట్ లో ఏకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించటం షాకింగ్ గా మారింది.

గత ఏడాది చేసిన రూ.148 కోట్ల కేటాయింపులతో పోలిస్తే.. ఏకంగా మరో రూ.850 కోట్లు అదనంగా కేటాయించటం చూస్తే.. కేసీఆర్ ప్రచార వ్యూహం ఎంత పెద్దదిగా ఉందన్న విషయం అర్థమవుతుంది.  ఎన్నికల ఏడాది కావటం.. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తమ పార్టీని విస్తరించే క్రమంలో ప్రజల సొమ్మును ప్రచారం కోసం భారీగా ఖర్చు చేసేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులు సాగాయని చెప్పక తప్పదు. ఏమైనా ప్రచారానికి ఇంత భారీగా ఖర్చు చేయటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News