కేసీఆర్ ఉంటేనే కాంగ్రెస్ కు లాభమట?

Update: 2021-07-12 05:07 GMT
తెలంగాణ ఇచ్చినా రెండు సార్లు అధికారం దక్కని కాంగ్రెస్ పార్టీకి యువరక్తం ఎక్కించింది అధిష్టానం. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ ను చేసి సీనియర్లు అందరినీ పక్కనపెట్టేసింది. 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసింది.

2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి రాజకీయ దూకుడు పనిచేస్తుందని.. కాంగ్రెస్ కు ఓట్లు వేయించగల సత్తా రేవంత్ కు ఉందని.. రేవంత్ రెడ్డియే కీరోల్ అవుతారని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

ఇటీవలే ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి తన దగ్గర ప్లాన్లు ఉన్నాయని.. ఖచ్చితంగా తీసుకొస్తానని నమ్మకంగా చెప్పుకొచ్చాడు.

2004 తర్వాత కాంగ్రెస్ రెండు పర్యాయాలు అధికారానికి దూరమై ప్రతిపక్షానికే పరిమితమైంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ గెలవలేకపోయింది. కేసీఆర్ రెండు సార్లు కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి వచ్చారు. ఇక అంతకుముందు 2004,2009లో కూడా కాంగ్రెస్ ఇలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని.. కాబట్టి రెండు దఫాల తర్వాత కేసీఆర్ కు ఓటమి తప్పదని రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నాడు.

కేసీఆర్ పై వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ప్రయోజనం అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే అతడి పరిపాలనపై ప్రజల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోందని.. ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి విశ్లేషించారు.

ఇక హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ కు, ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ కు మధ్య పోరాటం సాగుతుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి 2023లో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతామని.. అధికారం సాధించడమే తమ లక్ష్యం అని రేవంత్ రెడ్డి అన్నారు.

వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా అనంతరం  ఎన్నికల్లో గెలవలేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 1994 నుంచి పదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంటే 2004 నుంచి పదేళ్ల పాటు టీడీపీ పాలించిందని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇక అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రెండు సార్లు గెలిచి పదేళ్లు పాలించిందన్నారు.. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా రెండు సార్లు గెలిచిందని 2023 వరకు కేసీఆర్ పాలన ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు. రాజకీయ పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చాలన్న ప్రజల నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందన్నారు. ఇది సీఎం కేసీఆర్ కు అర్థమైందన్నారు.కాంగ్రెస్ నే ప్రత్యామ్మాయం అని ప్రజలు భావిస్తున్నారన్నారు.

ప్రతిపక్షంలో బీజేపీనా, కాంగ్రెస్  అన్న చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ కు ప్రత్యామ్మాయం కాంగ్రెస్ యేనని ప్రజలు భావిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా నిర్ణయం తీసుకున్నాక అందరూ గౌరవించాల్సిందేనని.. సీనియర్ల అసమ్మతి టీ కప్పులో తుఫాన్ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏదో జరుగుతుందని గోతికాడ గుంటనక్కల్లా ఎదురుచస్తున్న వారి ఆశలు నెరవేరవు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకే నా బాధ్యత.. ఆ తర్వాత ఎవరు ఏ స్థానంలో ఉండాలన్నది పార్టీ, అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సీఎం ఎవరనేది సోనియానే నిర్ణయిస్తారని.. అప్పటివరకు పనిచేసుకుంటూ పోవడమే నా కర్తవ్యం అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

కోమటిరెడ్డి తనను వ్యతిరేకించినా కూడా ఆయనను కలుపుకొని పోతానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, మోహన్ రెడ్డిలతో మాట్లాడానని రేవంత్ రెడ్డి తెలిపారు. వారు సోనియా నిర్ణయాన్ని గౌరవిస్తామని అన్నారని.. వెంకటరెడ్డితోనూ మాట్లాడుతామని చెప్పారన్నారు.
Tags:    

Similar News