అలా చేస్తే మహిళల దెబ్బకు మోదీ మటాషే..

Update: 2019-11-01 09:03 GMT
ఇంట్లో వారసత్వంగా వచ్చిన బంగారం ఉన్నా దానికి లెక్కలు చెప్పాల్సిందేనని.. అధికంగా ఉంటే పన్ను కట్టాల్సిందేనని.. కేంద్రం బంగారంపై పరిమితి విధించబోతోందని కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. కేంద్రం దీనిపై ఇప్పటికే వివరణ ఇచ్చింది.

అలాంటి ఆలోచనేమీ లేదని కేంద్రం చెప్పడంతో పాటు అధికారులు కూడా దీనికి సంబంధించి ఎక్కడా ఎలాంటి డెవలప్‌మెంట్ లేదని చెబుతున్నారు. అయినప్పటికీ మహిళ్లలో మాత్రం దీనిపై ఇంకా అనుమానాలు పోలేదు. ఇదే నిజమైతే మోదీకి మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని ... ఆయన పతనానికి అదే తొలిమెట్టు అవుతుందని అంటున్నారు.

బ్లాక్ మనీ తరహాలో బ్లాక్ గోల్డ్ కూడా బయటకు తీయాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రచారమవుతోంది. నిజానికి తరతరాలుగా వారసత్వంగా వచ్చిన బంగారానికి లెక్కలు ఉండవు... రసీదులూ మెంటైన్ చేసేవారు చాలా తక్కువ మందే.

అయితే.... మోదీ ప్రభుత్వం తీసుకొస్తుందని ప్రచారం జరుగుతున్న చట్టం నిజంగానే అమలైతే మాత్రం భారీగా బంగారం ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. కట్నంగా వచ్చిందని.. వారసత్వంగా వచ్చిందని చెప్పి తప్పించుకోవడానికి వీలుండదు.

ఈ కారణంగానే మహిళల్లో గందరగోళం నెలకొంది. పుస్తెలకు కూడా పన్ను కట్టాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. 2016 నవంబరు 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నల్లడబ్బును మార్చేసి కిలోల కొద్దీ బంగారం కొనుక్కున్నవారు ఉన్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. లక్ష్యం వారే అయినప్పటికీ సాధారణ కుటుంబాలూ ఈ ప్రభావానికి గురికాక తప్పదు. పాత బంగారమా? కొన్న కొత్త బంగారామా? తాత ముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిందా? ఏదైనా సరే బంగారం ఉంటే లెక్క చెప్పాల్సిందే.

అయితే.. ఈ లెక్కలు తీయడం అంత ఈజీ కాదు. దీనికోసం ప్రబుత్వం బంగారం దుకాణాల మీద ఆధారపడటం తప్ప వేరే మార్గంలో వెళ్లలేదు. అయితే, బంగారం దుకాణాల్లో రూ. 50 వేలకు మించి జరిగే క్రయవిక్రయాల్లో పాన్ కార్డు ఇవ్వాలనే నిబంధన ఉన్నా అదేమీ పక్కాగా అమలు కాదు. బంగారం విక్రయించే దుకాణాలు వారు సగం గ్రే బిజినెస్సే చేస్తారు. కాబట్టి దుకాణాల వైపు నుంచి కూడా లెక్కలు దొరకడం అంత ఈజీ కాదు.

ఇంతకుముందూ ఈ ప్రచారం జరిగింది..

నిజానికి మోదీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తరువాతా 2016లోనూ ఇలాంటి ప్రచారం జరిగింది. ప్రభుత్వం బంగారంపై పరిమితి విధిస్తుందని అంచనాలు వినిపించాయి. సాధారణంగా కొన్నబంగారంపై 3 శాతం జీఎస్టీ ఉంటుంది. ఆభరణాల తయారీ ఖర్చులపై 18 శాతం జీఎస్టీ ఉంది. రూ.20లక్షల వ్యాపార లావాదేవీలు దాటిన ప్రతి వ్యాపారి జీఎస్టీ పరిధిలోకి వస్తారు. 500 గ్రాముల బంగారం పరిమితి మించితే స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం అప్పట్లో సూచనప్రాయంగా చెప్పడంతో ఇప్పటి మాదిరిగానే గందరగోళం ఏర్పడింది. వివాహిత మహిళలకు 500 గ్రాములు, అవివాహిత మహిళలకు 250 గ్రాములు, పురుషులకు 100 గ్రాముల వంతున బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి ఇప్పటికే చట్టం అనుమతిస్తుంది. ఆపైన కొనుగోలుకు ఇప్పుడు కూడా లెక్కలు చెప్పాల్సిందే. అయితే.. పాత బంగారం లెక్కలు తీస్తే మాత్రం చాలామందికి ఇబ్బందులు తప్పవు.

ప్రస్తుతం రూల్ ప్రకారం బంగారం కొత్తదా, పాతదా అన్నది పక్కన పెడితే ఒక కుటుంబంలో గరిష్టంగా 1050 గ్రాముల బంగారం పన్ను కట్టకుండా కలిగి ఉండడానికి అవకాశం ఉంది. కుటుంబ యజమానికి అయిన పురుషుడికి 100 గ్రాములు, భార్యకు 500 గ్రాములు, పెళ్లికాని కూతురుంటే ఆమెకు 250 గ్రాములు, ఇద్దరు కొడుకులు ఉంటే 100 గ్రాముల చొప్పున 200 గ్రాములు కలిపి మొత్తం 1050 గ్రాములు కలిగి ఉండొచ్చు.

అయితే.. ఇంతకంటే ఎక్కువ కూడా కలిగి ఉండొచ్చు కానీ, అందుకు ఆదాయపన్ను లెక్కల్లో చూపించాల్సి ఉంటుంది. అలా చూపకుండా ఉంటే.. సెక్షన్‌ 69, 69 (ఏ), 69 (బీ) ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం బంగారం ఆస్తి. దాన్ని ఆస్తిగా చూపించి పన్ను కట్టాలి. ట్యాక్స్‌ కట్టి ఎన్ని కిలోలు కొనుక్కున్నా ఇబ్బందేమీ ఉండదు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం వారసత్వంగా వచ్చిన, ఇంట్లోని పాత బంగారంపై కూడా పన్ను ఉండదు.

నిజానికి కేంద్రం పాత బంగారంపైనా పన్ను వేయాలని తలపోసినా దేశంలో 50 శాతం మంది మహిళలు ఉండడంతో వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని.. అలా జరిగితే బీజేపీ మళ్లీ ఎక్కడా అధికారంలోకి రావడం అసాధ్యమని గుర్తించి వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News