ఆ నిఘా నేతాజీ మరణించలేదనేందుకు రుజువా?!

Update: 2015-04-14 05:43 GMT
విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణించాడని భారత ప్రభుత్వ అభిప్రాయం. అలాగని ఈ అంశం గురించి అధికారిక ధ్రువీకరణ కూడా లేదు. అయితే ప్రభుత్వం చెబుతున్న వివరాలకు అనుగుణంగా విమానప్రమాదం జరిగిన దాఖలాలు కూడా లేవనేది మరో వాదన. ఇలాంటి వాద ప్రతివాదనల మధ్య ఆ మహనీయుడి మరణం ఒక మిస్టరీగా నిలిచిపోయింది.

    దీని గురించి అప్పటి నుంచి అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ అంశం గురించి క్లారిటీ అయితే రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన స్నూప్‌గేట్‌ వ్యవహారం కొత్త అనుమానాలకు కారణం అవుతోంది.

    నెహ్రూ ప్రధాని అయ్యాకా నేతాజీకుటుంబంపై నిఘాకు ఆదేశించాడని తెలుస్తోంది. మరి నెహ్రూకు ఆ అవసరం ఏమిటి? ఒకవేళ నేతాజీ అప్పటికే మరణించి ఉండుంటే.. ఇక ప్రత్యేకంగా నిఘా ను పెట్టించాల్సిన అవసరం ఏమిటి? అనేవి ఇప్పడు ప్రధానమైన సందేహాలు.

    నేతాజీ తమ్ముడి కుమారుడు అయిన అర్థేందు బోస్‌ ఇవే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. నెహ్రూ తమ కుటుంబంపై నిఘాను పెట్టడాన్ని బట్టి నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని అనుకోవాల్సి వస్తోంది అర్థేందు అంటున్నారు.

    దీనిపై పూర్తి విచారణ జరపాలని.. నేతాజీ నేపథ్యాన్ని, ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ ప్రస్థానాన్ని తుడిచి పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని, దేశ చరిత్ర పుస్తకాల్లో కూడా వాటి ప్రస్తావన అస్సలు ఉండదని అర్థేందు అంటున్నారు.

    మరి ఇప్పుడు ఎలాగూ స్నూప్‌గేట్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి.. నేతాజీ మరణం పై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిగితే మేలేమో! మోడీ ప్రభుత్వం అందుకు పూనుకోగలదా?!



Tags:    

Similar News