ఇలాగైతే.. విదేశీ చ‌దువులు కష్టమే!

Update: 2021-05-31 00:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్.. మ‌రే దేశంపై చూపించని విధంగా భార‌త్ పై ప్ర‌భావం చూపింది. వైర‌స్‌ విజృంభ‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ల‌క్ష‌న్న‌ర పైచిలుకు కేసులు న‌మోద‌య్యాయి. ఈ విల‌యాన్ని చూసిన ప్ర‌పంచ దేశాలు.. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భార‌త్ పై రాక‌పోక‌ల విష‌యంలో ఆంక్ష‌లు విధించిన ఆయా దేశాలు.. ఇప్పుడు ఇండియా నుంచి త‌మ దేశానికి రావాల్సిన విద్యార్థుల‌పైనా క‌ఠిన ఆంక్ష‌లు పెడుతున్నాయి.

ఉన్న‌త చ‌దువుల కోసం ఎంతో మంది విద్యార్థులు వివిధ దేశాల‌కు వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. వారంద‌రికీ ఆయా దేశాల నిర్ణ‌యాల‌ను అనుస‌రించి ఒక్కోర‌క‌మైన ఇబ్బందులు వ‌స్తున్నాయి. కొన్ని దేశాలు టీకా వేసుకుంటే త‌మ దేశానికి వ‌చ్చేందుకు అనుమ‌తిస్తామ‌ని చెబుతుండ‌గా.. మ‌రికొన్ని ఏదిప‌డితే అది వేసుకొని వ‌స్తే ఒప్పుకోబోమని ప్ర‌క‌టిస్తున్నాయి. ఇంకొన్ని అయితే.. టీకా వేసుకున్నా, లేకున్నా.. ఈ ఏడాది త‌మ దేశంలో అడుగు పెట్టొద్ద‌ని తెగేసి చెబుతున్నాయి. మ‌రి, ఈ నేప‌థ్యంలో విద్యార్థుల ప‌రిస్థితి ఏంటీ? వారి కోసం ప్రభుత్వాలు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అమెరికా వెళ్లే విద్యార్థులు ఆ దేశంలో దిగ‌గానే క్వారంటైన్ కు వెళ్లి తీరాల్సిందే. అయితే.. యూఎస్ వెళ్లేవారు టీకా తీసుకోవాల‌న్న నిబంధ‌న లేదు. కానీ.. అక్క‌డ ఏ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్నారో.. వారే టీకా ఇప్పిస్తారు. ఇండియాలో టీకా తీసుకున్నామ‌ని చెబితే కుదర‌దు. అమెరికాలోని ఎఫ్‌డీఏ గుర్తించిన టీకాలు వేసుకున్న‌వారే వ్యాక్సిన్‌ తీసుకున్న‌ట్టు లెక్క‌. మ‌న‌దేశంలోని రెండు వ్యాక్సిన్ల‌నూ ఎఫ్‌డీఏ గుర్తించ‌ట్లేద‌న్న విష‌యాన్ని మ‌నం గుర్తించాలి. మ‌రి, ఇక్క‌డ వ్యాక్సిన్ తీసుని వెళ్లిన వారి సంగ‌తేంటీ? ఇక్క‌డ తీసుకున్నా.. మ‌ళ్లీ అక్క‌డ తీసుకుంటే ఇబ్బందులేమీ రావా? అన్న స‌మ‌స్య ఉండ‌నే ఉంది.

ఇక‌, ఆస్ట్రేలియా, కెన‌డా, న్యూజిలాండ్ దేశాల్లో చ‌దివేవారు గ‌తేడాదే క‌రోనా విజృంభ‌ణ వేళ ఇండియాకు వ‌చ్చేశారు. ఇప్పుడు కొత్త‌గా అడ్మిష‌న్లు తీసుకున్న‌వారు కూడా ఉన్నారు. వీరంద‌రినీ ఇండియాలోనే ఉండాల‌ని చెబుతున్నాయి ఆ దేశాలు. ఆన్ లైన్లోనే ఈ ఏడాది చ‌దువుకోవాల‌ని సూచిస్తున్నాయి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ దేశంలో అడుగుపెట్టే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు.

మిగిలిన దేశాల‌కు వెళ్లే వారికి వ్యాక్సిన్ కంప‌ల్స‌రీ అయ్యింది. రాబోయే రెండు నెల‌ల్లో ప‌లు దేశాల్లో విద్యాసంవ‌త్స‌రం మొద‌లు కానుంది. ఆయా దేశాల‌కు చుదువుకు వెళ్లే వారికి మ‌న రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇప్పించే ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు చేస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కం. ఇప్ప‌టికే.. కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ రాష్ట్రాలు ఈ విష‌యంలో విద్యార్థుల‌కు స‌హాయం చేస్తున్నాయి. విదేశాల్లో అడ్మిష‌న్ తీసుకున్న‌ట్టు ప‌త్రాలు చూపిస్తే.. వారికి స్పెష‌ల్ గా వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాయి. కాబ‌ట్టి.. మ‌న రాష్ట్రంలోనూ ఈ సౌక‌ర్యం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదంతా ఒకెత్త‌యితే.. ఇంకా వీసాల గోల ఉండ‌నే ఉంది. ఈ విధంగా విదేశాల్లో చ‌దువుకునేందుకు వెళ్లే విద్యార్థుల‌కు ఈ ఏడాది క‌ష్ట‌కాలమేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏ మాత్రం తేడా వ‌చ్చిన విద్యాసంవ‌త్స‌రం కోల్పోవాల్సి వ‌స్తుంది. అందువ‌ల్ల ప్ర‌భుత్వాలు స్పందించి, వీరికి ఇబ్బందులు రాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.
Tags:    

Similar News