ఓవైసీ కూటమి గెలిస్తే.. యూపీలో అలా చేస్తారట

Update: 2022-01-23 04:54 GMT
ఎన్నికలు అన్నంతనే ఓటర్లకు నోరూరిపోయే ఆఫర్లను ప్రకటించటం చూశాం. ఇప్పుడు అది కొనసాగుతూనే.. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా పరంగా చేపట్టే నిర్ణయాల్ని ముందుగా ప్రకటించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలనంగా మారారు. 403 స్థానాలున్న యూపీలో.. వంద స్థానాల్లో పోటీ చేస్తున్న ఓవైసీ పార్టీ.. మిగిలిన స్థానాల్లో అక్కడి స్థానిక పార్టీలతో జత కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ కూటమి కానీ యూపీలో విజయం సాధిస్తే.. ఒక ముఖ్యమంత్రి కాదు ఇద్దరు ముఖ్యమంత్రులు.. ముగ్గురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారని చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రుల్లో ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు.. మరొకరు దళిత వర్గానికి చెందిన వారుంటారని.. డిప్యూటీ ముఖ్యమంత్రుల్లో మాత్రం ఒకరు ముస్లిం వర్గానికిచెందిన వారు ఉంటారని పేర్కొనటం విశేషం.

తాజాగా ఆయన బాబు సింగ్ కుష్వాహ.. భారత్ ముక్తి మోర్చా పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఆయన తొలుత ఓం ప్రకాష్ రాజ్ భర్ కు చెందిన సుహల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే.. ఓవైసీతో పెట్టుకున్న పొత్తు నుంచి తప్పుకున్న రాజ్ భర్.. సమాజ్ వాదీతో జట్టుకట్టారు. అయినప్పటికీ తమకు పోయేదేమీ లేదన్న ఓవైసీ.. తమ పార్టీ బలంగా ఉన్న వంద స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

ముస్లింలను అన్నీ పార్టీలుఓటు బ్యాంకుగానే చూశాయే తప్పించి.. ఏ ఒక్క పార్టీ మైనార్టీల కోసం పని చేయలేదన్నారు. ఇప్పటివరకు ఎంతోమంది రాజకీయ అధినేతలు ఎన్నికల హామీల్ని ఇవ్వటం చూశాం కానీ.. మొదటిసారి ఇద్దరు ముఖ్యమంత్రులు.. ముగ్గురు డిప్యూటీ సీఎంల పేరుతో ఓవైసీగారి ఎన్నికల హామీ మాత్రం కొత్త పుంతలు తొక్కిస్తుందని చెప్పక తప్పదు. మరి.. ఆయన మాటలకు యూపీ ఓటర్లు ఎలా రియాక్టు అయ్యారన్నది తేలాలంటే మాత్రం మార్చి 10న విడుదలయ్యే ఫలితాల కోసం ఎదురుచూడాల్సిందే.
Tags:    

Similar News