ఎందుకంటే ప్రేమంట : సీఎంఓ పై క‌న్నేస్తే బొత్స ఊరుకోరు ! ఉపేక్షించ‌రు !

Update: 2022-04-26 04:09 GMT
ప్రేమ గొప్ప‌ది కానీ బొత్స ప్రేమ విభిన్నం మ‌రియు విస్తృతం కూడా ! ఆ విధంగా సీఎంపై ఆయ‌న పెంచుకున్న ప్రేమ కార‌ణంగా ఇవాళ ఏపీలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. మండ‌టెండ‌ల్లో పాపం న్యాయ‌మో జ‌గ‌న్మోహ‌నా ! అని అడిగిన వారిని ఎవ్వ‌రినీ ఉపేక్షించ‌క స్టేష‌న్ల‌కు త‌ర‌లించి గురువుల‌ను భ‌లే రీతిన నియంత్రించి నూతన హోం శాఖ మంత్రి  మ‌రియు నూత‌న విద్యా శాఖ మంత్రి అయిన బొత్స మరియు వ‌నిత ఇద్ద‌రూ స‌క్సెస్ అయ్యారు. వీరితో పాటు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో నియ‌మితుల‌యిన కొత్త డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా !

ప్ర‌జా ఉద్య‌మాల‌ను అణిచివేసిన‌ప్పుడు బొత్స ఆ రోజు స్పందించారో లేదో కానీ ఇవాళ మాత్రం సీరియ‌స్ అయ్యారు. అస‌లు టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్రజా ఉద్య‌మాల స‌మ‌యంలో వైసీపీ ఏ విధంగా న‌డుకుందో ఊహించుకుంటే ఇప్ప‌టికీ వాళ్లేనా వీళ్లు అన్న డౌట్ రాక మాన‌దు. కానీ అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ రూల్స్ అన్నీ మారిపోయాయి. ఆ పార్టీలో ఉన్న క‌మ్యూనిస్టు సానుభూతిప‌రులు కూడా పూర్తిగా పంథా మార్చేశారు. దాంతో ఎవ్వ‌రినీ ఇప్పుడు ఏం అన‌లేం. అధికార దాహం ఓ వైపు వ్యామోహ రీతి మ‌రోవైపు ఈ నాయ‌కులను ఈ విధంగా త‌యారుచేస్తోంద‌ని ఉపాధ్యాయ సంఘ నేత‌లు క‌న్నీటి ప‌ర్యంతం అవుతూ మాట్లాడుతుంటే., ఎప్ప‌టిలానే ఉపాధ్యాయుల చ‌ర్య‌ల‌ను త‌ప్పు ప‌డుతూ సంబంధిత శాఖ మంత్రి బొత్స ఫైర్ అయ్యారు.

సీపీఎస్ ర‌ద్దుకు సంబంధించి ఇవాళ ఉపాధ్యాయులు క‌దంతొక్కారు. ఎప్ప‌టిలానే త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసేందుకు స‌మాయ‌త్తం అయ్యారు. కానీ ఈ సారి పోలీసులు చాలా అంటే చాలా స‌క్సెస్ అయ్యారు. జిల్లాల‌లో పోలీసులు మ‌ఫ్టీలో వెళ్లి కొంద‌రు ఉపాధ్యాయ సంఘ నేత‌ల‌ను అదుపులో తీసుకున్నారు. కొన్ని చోట్ల గృహ నిర్బంధం చేశారు. ఎన్న‌డూ లేనంత‌గా ఉపాధ్యాయుల‌కు పోలీసులు హెచ్చ‌రిక‌లు చేశారు. దీంతో చాలా మంది ఏమీ చేయ‌లేక వెన‌క్కు త‌గ్గిపోయారు. తాము న్యాయ ప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న‌కు రోడ్డెక్క‌డం కూడా చ‌ట్ట విరుద్ధమేనా అని ప్ర‌శ్నించారు  ఉపాధ్యాయులు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ తాము కోరి ఎంచుకున్న ప్ర‌భుత్వం ఈ విధంగా చేయ‌డం భావ్యంగా లేద‌ని ఇది ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిగా పూర్తి భిన్నంగా ఉంద‌ని ఆవేద‌న చెందారు.

ఇవాళ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ముట్ట‌డికి ప్ర‌య‌త్నించి ఉపాధ్యాయులు విఫ‌లం అయ్యారు. యూటీఎఫ్ నేతృత్వాన  జరిగిన ఈ  కార్య‌క్ర‌మం మాత్రం పోలీసుల అప్ర‌మ‌త్త‌త మ‌రియు అతి కార‌ణంగా విఫ‌లం అయింద‌ని నిర్థిష్ట స‌మాచారం అందుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ హౌస్ అరెస్టులు, రైల్వే స్టేష‌న్ల‌లో త‌నిఖీలు మ‌రియు అరెస్టులు కార‌ణంగా ఉపాధ్యాయ సంఘ నేత‌లు పోలీసుల దిగ్బంధంలో ఇరుక్కుపోయారు.

అదేవిధంగా విజ‌య‌వాడ‌లో భారీగా పోలీసులు మోహ‌రించి ఉపాధ్యాయుల నిర‌స‌న‌ను భ‌గ్నం చేసేందుకు చేసిన ప్ర‌తి వ్యూహం మ‌రియు ప్ర‌య‌త్నం స‌ఫ‌లీకృతం అయింది. దీంతో కొత్త హో మంత్రి తానేటి వ‌నిత ఆనందంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఎందుకంటే గ‌తంలో పీఆర్సీ కి సంబంధించి చేసిన ఉద్య‌మంలో భాగంగా ఛ‌లో విజ‌య‌వాడ స‌క్సెస్ అయింది.దాంతో సీఎం కూడా అనూహ్య ఫ‌లితాలు రావ‌డంతో అప్ప‌టి డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ను త‌ప్పించారు. త‌న సామాజిక‌వర్గంకు చెందిన వారినే బిగ్ బాస్ గా నియ‌మించుకున్నారు. ఈ నియామకం పై కోర్టులో స‌వాలు చేస్తాన‌ని గౌత‌మ్ చెప్పినా ఎందుక‌నో ఆయ‌న వెన‌క్కు త‌గ్గారు.

ఇప్పుడు తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించి. సీఎంఓను ముట్ట‌డించాల‌ని ఉపాధ్యాయులు భావించ‌డం ప్ర‌జాస్వామ్య విరుద్ధం అని తేల్చేశారు. అంతేకాదు ఆయ‌న ఇంటిపై కానీ ఆఫీసు పై కానీ క‌న్నెస్తే సహించ‌బోన‌ని ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారు. ఉప‌క్షేంచబోన‌ని కూడా అన్నారు. ఎందుకంటే తామెంతో మాన‌వ‌తా దృక్ప‌థంతో ఉపాధ్యాయుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రాముఖ్యం ఇస్తున్నామ‌ని, అయినా కూడా స‌మ‌స్య‌లు పరిష్కారార్థం రోడ్డెక్క‌డం భావ్యం కాద‌ని అన్నారు.
Tags:    

Similar News