రాహుల్ సభ వేళ పత్రికలకు ఇచ్చిన జాకెట్ యాడ్ చూస్తే ఈ ఆలోచన ఖాయం

Update: 2022-05-06 06:25 GMT
ఎవరు అవునన్నా.. కాదన్నా.. దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకే ఇవ్వాలి. ఇవాల్టి రోజున పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో.. ధర్నా చేస్తామన్న ప్రకటన చేసినంతనే.. ఇంట్లోనే హౌస్ అరెస్టు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు.. యూపీఏ ఛైర్మన్ హోదాలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకూడదని సోనియాగాంధీ డిసైడ్ అయి ఉంటే.. ఈ రోజున తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకంటే.. ఎవరెన్ని పోరాటాలు చేసినా మేం పట్టించుకోమని మొండిగా భీష్మించుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు?

ఇవాల్టి రోజున దేశాన్ని పాలిస్తున్న మోడీ సర్కారు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపక్షంలో ఒక తీరు కామన్ గా కనిపించక మానదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎవరు మాట్లాడినా.. ఎలాంటి ఉదంతం చోటు చేసుకున్నా.. వాటి గురించి అస్సలు మాట్లాడకుండా కాలాన్ని గడిపేయటం కొత్త అలవాటుగా మారింది. ఇలాంటి పరిస్థితిని తెలంగాణ సాధన వేళ.. సోనియాగాంధీ తెలంగాణ ప్రాంతంలో అమలు చేస్తే.. కేసీఆర్ ఎంత కొట్టుకున్నా ప్రత్యేక తెలంగాణ సాధ్యమయ్యేది కాదున్నది మర్చిపోకూడదు.

అయితే.. ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణను సాధించటం ద్వారానే రాజకీయ రంగంలో ఉన్న అన్ని పార్టీల వారికి బోలెడన్ని పదవులు వచ్చాయని.. వాటి క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలో వేయాలని గులాబీ నేతల నోటి నుంచి తరచూ వస్తూ ఉంటుంది. టీఆర్ఎస్సే ఇంతలా అనుకుంటే.. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ.. దానికి అన్నీ తానైనట్లుగా వ్యవహరించే సోనియా గాంధీకి మరెంత ఉండాలి? అయినప్పటికీ అలాంటివేమీ పెట్టుకోకుండా ఉన్న వేళ.. కాంగ్రెస్ పార్టీపై అదే పనిగా విరుచుకు పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఈ రోజు (శుక్రవారం) వంగల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం.. దానికి రాహుల్ గాంధీ హాజరు కానుండటం తెలిసిందే. ఈ సభ కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారీగా కష్టపడ్డారు. సభను సక్సెస్ చేయటం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అంతేకాదు.. బహిరంగ సభకు గ్రాండ్ లుక్ రావడానికి అవసరమైన అన్ని పనులతో పాటు భారీగా ఖర్చు కూడా చేయటం మామూలు విషయం కాదు. అయినప్పటికీ వెనుకాడని తత్త్వం చూసినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మీద కొత్త ఆశలు చిగురించే వీలుంది.  

రాహుల్ సభ కోసం ఈ రోజున పలు దినపత్రికల్లో భారీ ఎత్తున జాకెట్ యాడ్స్ ఇచ్చారు. కొన్ని యాడ్స్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖుల ఫోటోల్ని పబ్లిష్ చేశారు. ఇదంతా చూసినప్పుడు.. ఇంత మంది ఉండి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఎందుకుందన్న సందేహం కలగక మానదు. జాకెట్ యాడ్ లో పబ్లిష్ చేసిన ఫోటోలు దగ్గర దగ్గర 22 వరకు ఉన్నాయి. వీరు మాత్రమే ఎన్నికల్లో గెలిచినా.. వచ్చే ఎన్నికల్లో పాతిక సీట్లు ఖాయంగా కనిపిస్తుంది.

వీరే కాక.. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న మరికొందరు బలమైన నేతలు కేవలం ఎన్నికల వేళలోనే బయటకు వస్తారు. ఇలాంటి వారిలో కొందరు గెలిచినా.. కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తాజాగా జాకెట్ యాడ్ పుణ్యమా అని.. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రముఖులు మరోసారి గుర్తుకు వచ్చారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News