స్లిమ్ క్రికెటర్లు కావాలంటే ఫ్యాషన్ షోలకు వెళ్లి తెచ్చుకోండి.. గావస్కర్ వ్యంగ్యం

Update: 2023-01-20 08:40 GMT
117, 125, 162, 75, 126.. ఇవీ గత తొమ్మిది ఇన్నింగ్స్ లో ఓ బ్యాట్స్ మన్ బాదిన పరుగులు.. ఇందులో నాలుగు సెంచరీలే... తొమ్మిది ఇన్నింగ్స్ లో 982.. ఇవీ నిరుడు ఇదే బ్యాట్స్ మన్ రంజీ సీజన్ లో చేసిన పరుగులు.. ఇదే ఆటగాడు అంతకుముందు సీజన్ లో 391 బంతుల్లో ఓ అజేయ ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టాడు.. కానీ, అతడికి టీమిండియా పిలుపు రావడం లేదు. ఇన్ని పరుగులు చేస్తున్నా.. ప్రత్యేకించి రంజీల్లో అదరగొడుతున్నా అతడికి జాతీయ జట్టు సెలక్టర్ల కరుణ దొరకడం లేదు. దీనిపై ఇప్పటికే ఓసారి వివాదం కూడా రేగింది. అయినప్పటికీ ఏమాత్రం స్పందన లేదు. అయితే, కాస్త బొద్దుగా ఉండే ఆ ఆటగాడి శరీరమే.. ఫిట్ నెస్ ప్రతిబంధకంగా మారిందనే వాదనలు వస్తున్నాయి. అది అతడి శరీర నిర్మాణమే తప్ప లోపం కాదంటూ క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ శరీర బరువు (తీరు) కారణంగా ఆ ఆటగాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకుంటే అది ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తుతున్నారు.

ఎవరా ఆటగాడు? ఏమిటా కథ?

పై చర్చంతా ముంబై బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ గురించి. 12 ఏళ్ల వయసులో.. 2011లో హ్యారిస్ షీల్డ్ ఇంటర్ స్కూల్ టోర్నీలో రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్త రఫున ఆడుతూ 439 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అయితే, ఆ తర్వాత కథ మలుపులు తిరిగింది. వయసును దాచిన ఆరోపణలపై ముంబై క్రికెట్ సంఘం సర్ఫరాజ్ పై సస్పెన్షన్ వేటు పడింది. అడ్వాన్స్ టెస్టుతో చివరకు సర్ఫరాజ్ తప్పేమీ లేదని అధునాతన పరీక్ష తో తేలింది. ఇక ముంబై అండర్ 19 జట్టు తరఫున ప్రతిభ చాటిన సర్ఫరాజ్ ను 2013 క్వాడ్రాంగులర్ సిరీస్ కు ఎంపికయ్యాడు. 2014 అండర్ 19 కప్ తో ఆరు ఇన్నింగ్స్ లో 211 పరుగులు, సగటు 70. ఇవీ 2014 అండర్ 19 ప్రపంచ కప్ లో సర్ఫరాజ్ పరుగులు. 2015లో కోహ్లి నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంపికయినప్పటికి అతడి వయసు కేవలం 16 ఏళ్లే. వయసు పరంగా అప్పటికి ఇదే రికార్డు. ఇక 2016 అండర్ 19 ప్రపంచ కప్ 355 పరుగులు చేసిన అతడు జట్టును క్లిష్ట సమయాల్లో ఒడ్డున పడేశాడు. కాగా, ముంబైలో పోటీని తట్టుకోలేకో, అతడి సామర్థ్యం తగ్గడమో మరే కారణమో గాని సర్ఫరాజ్ 2015-16 రంజీ సీజన్ లో ముంబైకి మారాడు. తర్వాత తిరిగి ముంబైకి వచ్చాడు.

ఆసీస్ సిరీస్ కు చోటు దక్కలే.. రెండేళ్లుగా నిలకడగా సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న సర్ఫరాజ్ ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. కానీ, పోటీ నేపథ్యంలో ఓ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా అతడికి స్థానం కష్టమవుతోంది. దీనికితోడు సర్ఫరాజ్ స్లిమ్ గా ఉండడనే వాదన ఉంది. అంతర్జాతీయ మ్యాచ్ ఫిట్ నెస్ అతడికి లేదనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సిరీస్ కూ చోటు దక్కలేదు. దీంతో దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. ఆటగాళ్లను వారి శరీర ఆకారాలను బట్టి కాకుండా వారి ఆటతీరును బట్టి ఎంపిక చేయాలని సునీల్ గావస్కర్‌ సెలెక్టర్లకు సూచించారు. సెలెక్టర్లు క్రికెటర్లను ఆకారాన్ని బట్టి కాకుండా వారి ఫామ్‌ని చూసి ఎంపిక చేయాలని అన్నారు. స్లిమ్‌గా ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయాలనుకుంటే సెలెక్టర్లు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్‌ని ఎంచుకుని వారికి బ్యాట్, బాల్‌ ఇచ్చి  ఆపై వారిని చేర్చుకోవాలని గావస్కర్‌ వ్యాఖ్యానించారు.

'అన్‌ఫిట్‌గా ఉంటే సెంచరీలు చేయలేరు. కాబట్టి క్రికెట్‌లో ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. మీరు యో-యో టెస్ట్ చేయాలనుకోవడంలో  నాకు ఇబ్బంది లేదు. కానీ, యో-యో టెస్ట్ మాత్రమే ప్రామాణికం కాదు. ఆటగాడు క్రికెట్‌కు సరిపోతాడనుకుంటే యో-యో టెస్టు ముఖ్యమైనదిగా భావించకూడదు. ఒక ఆటగాడు సెంచరీలు బాదుతున్నాడంటే అతడు క్రికెట్‌కు ఆడటానికి ఫిట్‌గా ఉన్నాడని అర్థం. మీకు స్లిమ్‌గా ఉన్న క్రికెటర్లు మాత్రమే కావాలనుకుంటే మీరు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్‌ని ఎంచుకుని, ఆపై వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి చేర్చుకోండి. క్రికెటర్లు శారీరకంగా చాలా ఆకారాల్లో ఉన్నారు. ఆకారాన్ని బట్టి కాకుండా వారు చేసే పరుగులు, తీసే వికెట్ల ఆధారంగా ఎంపిక  చేయండి' అని  గావస్కర్‌ అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News