ఎంత మంచిగా ఉన్నా చిన్న‌మ్మ రిలీజ్ కార‌ట‌!

Update: 2019-06-13 06:37 GMT
చిన్న‌మ్మ అలియాస్ శ‌శిక‌ళ‌ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌మిళ‌నాడు అమ్మ జ‌య‌ల‌లిత‌కు అత్యంత స‌న్నిహితురాలిగా ఉన్న ఆమె.. స్నేహ‌ధ‌ర్మంలో భాగంగా జ‌య‌ల‌లిత మీద ప‌డిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె కూడా నిందితురాలిగా  కేసు న‌మోదుకావ‌టం తెలిసిందే. ఆ త‌ర్వాత కాలంలో అమ్మ‌తో పాటు.. చిన్న‌మ్మ‌కు కూడా జైలుశిక్ష విధించారు.

అమ్మ అనారోగ్య మృతి చెంద‌టంతో.. ఈ కేసులో చిన్న‌మ్మ‌.. ఆమెతో పాటు దోషిగా నిరూపితులైన ఇళ‌వ‌ర‌సి.. సుధాక‌ర‌న్ లు జైలుశిక్ష అనుభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో వారు నాలుగేళ్ల జైలుశిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కావాల్సిన చిన్న‌మ్మ మిస్ అయి.. క‌ర్ణాట‌క‌లోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న సంగ‌తి తెలిసిందే.

1991-96లో చేసిన నేరానికి ప్ర‌స్తుతం జైలుశిక్ష అనుభ‌విస్తున్న ఆమె.. గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా జైలుజీవితాన్ని గ‌డుపుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం ఆమె నాలుగేళ్లు జైలు అనుభ‌వించాల్సి ఉంది. అయితే.. జైల్లో ఉండే ఖైదీలు స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగి ఉంటే.. వారిని ముందే విడుద‌ల చేస్తుంటారు.

అదే రీతిలో చిన్న‌మ్మ‌ను కూడా జైలు నుంచి విడుద‌ల చేస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా క‌ర్ణాట‌క జైళ్ల‌శాఖ అధికారిణి రూప ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. స‌త్ప్ర‌వ‌ర‌త‌న కింద శ‌శిక‌ళ‌ను ముందస్తుగా విడుద‌ల చేయ‌టం సాధ్యం కాద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.  చ‌ట్ట ప్రకారం నేర‌స్తులు స‌త్ప్ర‌వ‌ర్త‌న ప్ర‌కారం ముందుస్తుగా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని.. కాకుంటే శ‌శిక‌ళ‌కు ఇది వ‌ర్తించ‌ద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఎందుక‌న్న విష‌యం మీద ఆమె వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News