ఉత్తమ్‌లో కొత్త జోష్.. రాహుల్ ఓ రేంజ్‌లో పొగిడేశారు
ఈ సంచలనానికి కొనసాగింపుగా అన్నట్లుగా తాజాగా రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రసంశించారు.
సాధ్యాసాధ్యాలు, సమీకరణాలు పక్కనపెడితే, తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మార్పు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏ సమయాన ముఖ్యమంత్రి పీఠం మారుతుందని పేర్కొనడమే కాకుండా, తనకు ఢిల్లీ నుంచి ఈ మేరకు సమాచారం ఉంది అనే వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ సీఎం మార్పు అనే టాపిక్ తెలంగాణలో సంచలనంగా మారింది. అంతేకాకుండా కొత్త ముఖ్యమంత్రిగా ఎవరికి ఛాన్స్ ఉంటుంది అనే పేరు కూడా ఆయన వెల్లడించారు. సదరు ఆశావాహుల పేర్లలో ఒకటైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ఆసక్తికర రీతిలో రాహుల్ గాంధీ దృష్టిలో పడి ఆయన అభినందనలు పొందడం ఈ చర్చను మరో స్థాయికి తీసుకువెళుతోంది.
ఇటీవల బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి పట్టు సడలుతోందని పేర్కొంటూ ఆయనకు అధిష్టానం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వివరిస్తూ... త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని వెల్లడించారు. దీనితో పాటుగా ముఖ్యమంత్రి పదవి రేసులో ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. ఈ సంచలనానికి కొనసాగింపుగా అన్నట్లుగా తాజాగా రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రసంశించారు.
తెలంగాణలో జరగబోయే కులగణన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసిన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనువదించారు. రాహుల్ అభిప్రాయాలను ఆయన హాజరైన వారికి తెలుగు భాషలో వ్యక్తీకరించారు. రాహుల్ తన ప్రసంగం ముగిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందించారు. తన ప్రసంగాన్ని చక్కగా అనువదించారని ఉత్తమ్ ను మెచ్చుకుంటూ ఎక్స్‌లెంట్ ప్రజెంటేషన్ అంటూ కితాబు కూడా తెలిపారు.
రాహుల్ గాంధీ పీసీసీ మాజీ అధ్యక్షుడికి ఇచ్చిన ప్రశంస సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ గతంలో రేవంత్ రెడ్డి వైపు ఉండగా ఇప్పుడు అది మారుతోందా? తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాల అభిప్రాయాలు, ఆందోళనలు పరిగణలోకి తీసుకోవడమే దీనికి కారణమా? రేవంత్ తర్వాత పరిశీలించబోయే పేరు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అయిన అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న అంశం ఇందులో వాస్తవాలు తెలియాలి అంటే మరి కొంత కాలం ఎదురు చూడాల్సిందే.