బీజేపీ డిమాండ్.. టీఆర్ ఎస్ లో కలకలం

Update: 2019-08-27 09:01 GMT
వాళ్లిద్దరూ ఆగర్భశత్రువులు. కరీంనగర్ అసెంబ్లీ వేదికపై గెలవడానికి యుద్ధమే చేశారు. నిన్ను లేకుండా చేస్తానంటూ విలేకరుల సమావేశంలోనే బహిరంగంగా వ్యాఖ్యానించిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఒకవైపు.. కాలం కలిసి వచ్చి ఎమ్మెల్యేగా ఓడినా ఆ తర్వాత ఎంపీగా గెలిచిన నేత మరోవైపు.. ఇద్దరు పాత కాపుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం మొదలైందంటున్నారు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కరీంనగర్  టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ - కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ల మధ్య విభేదాలున్నాయన్న సంగతి కరీంనగర్ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. గంగులపై గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు బండి సంజయ్. అప్పుడే బండి సంజయ్ ని హెచ్చరిస్తూ బొక్కలు ఇరుగుతాయ్ .. ఖతం చేస్తాం అంటూ గంగుల విలేకరుల సమావేశంలో అనడం తీవ్ర దుమారం రేపింది.

అయితే బండి సంజయ్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడి ఎంపీగా గెలిచాక గంగుల పనిపట్టేందుకు రెడీ కావడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఆయువు పట్టుపై కొట్టేందుకు బండి సంజయ్ తాజాగా అస్త్రం రెడీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల చేతిలో భారీగా గ్రానైట్ కొండలు ఉన్నాయని.. వాటిని కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. భారీగా గ్రానైట్ జీరో దందా చేసి ప్రభుత్వానికి 125 కోట్ల సీనరేజ్ నిధులను ఎగ్గొట్టారని ఆరోపించారు. వేల కోట్ల వ్యాపారం చేసి ట్యాక్సులు కట్టలేదని మండిపడ్డారు.. దీనిపై కేంద్రంలో ఫిర్యాదు చేసి విచారణ చేయిస్తానని ఆయన ప్రతిన బూనడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఆరోపణలు కరీంనగర్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగులను ఉద్దేశించే బండి సంజయ్ చేశారని పార్టీల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ప్రధాన వ్యాపారం గ్రానైట్ పరిశ్రమే. ఆయన దీనిపైనే కోటీశ్వరుడయ్యాడు. ఇప్పుడు బండి ఆరోపణలు గంగులను దెబ్బతీయడానికేనన్న చర్చ జిల్లాలో సాగుతోంది.ఇలా బీజేపీ ఎంపీ గ్రానైట్ ను నమ్ముకున్న అందరు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు ఎసరు పెట్టడం.. దీనిపై కేంద్రం విచారణ చేయాలని  కోరుతాననడంతో టీఆర్ ఎస్ లో కలకలం రేగుతోంది.
Tags:    

Similar News