సీఎం కేసీఆర్ కు అనారోగ్యం.. ఏమైంది?

Update: 2021-01-07 10:50 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గురువారం ఆయనను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే.. స్వల్ప అస్వస్థత వల్లే కేసీఆర్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

యశోదా ఆసుపత్రి డాక్టర్లు ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు, పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీత్ సాగర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్.. కేసీఆర్ కు ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాగ్నిటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ), కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్‌ కూడా నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఆసుపత్రికి వెళ్లడానికి ముందు కేసీఆర్.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. సోమాజీగూడలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం కేసీఆర్.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారని, అనంతరం ఊపిరితిత్తులు, ఛాతీలో మంటగా అనిపించడంతో ఆసుపత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే.. హాస్పిటల్ లో అడ్మిట్ అవుతారా? లేదంటే.. వైద్య పరీక్షలు ముగించుకొని వెళ్లిపోతారా? అన్నది తెలియాల్సి ఉంది.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా యశోదా ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా.. కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో నగరంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు చేరుకుంటున్నారు.
Tags:    

Similar News