నేను దేవుణ్ణి కాదు..పాక్ యువ‌తితో సుష్మా!

Update: 2017-12-21 12:53 GMT
కొంతకాలంగా భార‌త్‌ - పాకిస్థాన్ ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో వైద్యం కోసం భార‌త్ కు రావాల‌నుకుంటున్న పాకిస్థానీల‌కు వీసాలు మంజూరు చేయిస్తూ వారి పాలిట కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అప‌ద్భంధువులా మారారు. గ‌తంలో ఓ పాకిస్థాన్ చిన్నారి ఆప‌రేష‌న్ కోసం అత‌డి త‌ల్లిదండ్రుల‌కు - కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ మ‌రో మహిళ‌కు - గుండె వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారికి....ఇలా చాలామంది పాకిస్థానీల‌కు వైద్యం కోసం వీసాలు మంజూరు చేసి త‌న ద‌యార్ధ్ర‌త‌ను చాటుకున్నారు. సుష్మ త‌మ దేశ ప్ర‌ధాని అయితే ఎంత బాగుంటుందో అంటూ పాకిస్థానీ మ‌హిళ చేసిన‌ ట్వీట్ అప్ప‌ట్లో వైర‌ల్ అయింది. తాజాగా, మ‌రో యువ‌తి సుష్మాను....దేవుడితో పోలుస్తూ ట్వీట్ చేసింది. దానికి సుష్మా స్వ‌రాజ్ కూడా ఆస‌క్తిక‌రమైన జ‌వాబిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

దాయాది దేశానికి చెందిన ర‌బియా షెహాబ్ ..అనే యువ‌తి తండ్రి కొంత కాలంగా కాలేయ సంబంధ వ్యాధితో ఇబ్బందిప‌డుతున్నారు. ఆయ‌న‌కు కాలేయ మార్పిడి త‌ప్ప‌నిస‌రి అని వైద్యులు సూచించారు. దీంతో, భార‌త్ లో ఆయ‌న కాలేయ మార్పిడి కోసం వీసా జారీ చేయాల‌ని సుష్మా స్వ‌రాజ్ ను ట్విట్ట‌ర్ ద్వారా కోరింది. అంతేకాకుండా ఆ ట్వీట్‌ లో సుష్మా స్వ‌రాజ్ ను ర‌బియా 'ఇబ్నే-ఎ-మ‌రియం` (మేరీ మాత కుమారుడు - ఏసు ప్ర‌భువు అని అర్థం) అని సంబోధించింది. ఈ ట్వీట్ కి సుష్మా ఆస‌క్తిక‌ర రిప్లై ఇచ్చారు.   'నేనేం దేవుణ్ని కాదు.. కాలేను కూడా! నీ బాధ నేను అర్థం చేసుకోగ‌ల‌ను. పాకిస్థాన్ లో ని భార‌త హై క‌మిష‌న్ కార్యాల‌యాన్ని సంప్ర‌దించండి. భార‌త్ లో మీ తండ్రి కాలేయ మార్పిడి కోసం మేము వీసా జారీ చేస్తాం` ' అని ట్వీట్ చేశారు. అలాగే మ‌రో ట్వీట్‌ లో ఫాతిమా అనే మ‌హిళ త‌న భ‌ర్త వీసా కోసం చేతులు జోడిస్తూ వేడుకుంటున్నాన‌ని పేర్కొంది. దీనికి `వేడుకోవాల్సిన అవ‌సరం లేదు.. స‌మ‌స్య చెప్పండి చాలు!` అని సుష్మా ట్వీట్ చేశారు. ఏది ఏమైనా - దాయాది దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాల‌ను ప‌క్క‌న‌బెట్టి మాన‌వ‌త్వంతో సుష్మా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు పాకిస్థానీలు ఫిదా అయిపోయారు.
Tags:    

Similar News