భార‌త్‌లో ఆర్థిక మాంద్యం గురించి షాకింగ్ విష‌యాలు చెప్పిన ఐఎంఎఫ్‌!

Update: 2022-10-12 08:25 GMT
భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమని  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తన తాజా అవుట్‌లుక్‌లో తెలిపింది. భారత్‌ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ తగ్గించడం ఇది వరుసగా రెండోసారి కావ‌డం గ‌మ‌నార్హం. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా ఐఎంఎఫ్ పేర్కొంది. అయితే వృద్ధి విష‌యంలో ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే భార‌త్ మెరుగైన స్థాయిలోనే ఉంద‌ని ఐఎంఎఫ్ ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ఆర్థిక మాంద్య ప‌రిస్థితుల ప్ర‌భావం భార‌త్‌పై కూడా ఉంటుంద‌ని ఐఎంఎఫ్ చెబుతోంది. అయితే దీనివ‌ల్ల భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని.. భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు ఐఎంఎఫ్‌ ఆసియా-పసిఫిక్‌ విభాగాధిపతి కృష్ణన్‌ శ్రీనివాసన్‌ తెలిపారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1/3వ వంతు వాటా కలిగిన దేశాలన్నీ ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరంలో ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటాయని శ్రీనివాస‌న్ అంచ‌నాగా ఉంది. ఆయా దేశాల్లో మాంద్యం ప‌రిస్థితుల‌తో ద్రవ్యోల్బణం (ధ‌ర‌ల పెరుగుద‌ల‌) గణనీయంగా పెరుగుతుందని ఆయ‌న చెబుతున్నారు.

అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం, చైనా-తైవాన్ ఉద్రిక్త‌తలు, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో భార‌త వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్ 2022-23కి 6.8 శాతానికి త‌గ్గించింది. అయితే ఐఎంఎఫ్ వృద్ధిరేటును త‌గ్గించినా ప్రపంచంలోనే వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుండడం గమనార్హం.

మ‌రోవైపు రానున్న రోజుల్లో ప్ర‌పంచం దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంద‌ని ఐఎంఎఫ్‌ పరిశోధన విభాగం సంచాలకులు పియరీ ఒలివియర్‌ గౌరించాస్‌ తెలిపారు. ప్రస్తుతం ఆసియా ప్రాంతం మూడు సవాళ్లను ఎదుర్కొంటోంద‌ని బాంబు పేల్చారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీరేట్లను పెంచుతుండడంతో ఆర్థిక స్థితి కఠినంగా మారుతోంద‌న్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల ఆయా వ‌స్తువులు, ఆహార పదార్థాల ధరలు పెరిగిపోతున్నాయ‌ని తెలిపారు. గ‌తంలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన‌ చైనా ఆర్థిక వ్యవస్థ సైతం నెమ్మదించింద‌ని చెబుతున్నారు. ఈ కార‌ణాల‌తో భారత్‌తో పాటు ఆసియాలో వృద్ధి స‌న్న‌గిల్లుతోంద‌ని తెలిపారు.

ఇక మ‌న‌దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. విదేశీ పెట్టుబ‌డిదారులు త‌మ పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రిస్తుండ‌టం భారత్‌పై ప్రభావం చూపుతున్నాయన్నాయ‌ని పియ‌రీ చెబుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీల‌క వడ్డీరేట్లను పెంచుతూ సరైన నిర్ణయం తీసుకుందని ఐఎంఎఫ్‌ ఆసియా-పసిఫిక్‌ విభాగాధిపతి కృష్ణన్‌ శ్రీనివాసన్ వివ‌రించారు. అయితే, దీనివల్ల దేశీయంగా గిరాకీ తగ్గిపోతోంద‌ని చెప్పారు. వడ్డీరేట్ల పెంపు ప్రభావం పెట్టుబడులపై ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ కారణాలతోనే భార‌త ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్నారు.

అయితే, భారత మూలధన వ్యయ లక్ష్యాలు ఆశాజనకంగా ఉన్నాయ‌ని శ్రీనివాస‌న్ వెల్ల‌డించారు. వాటిని సరిగ్గా అమలు చేయగలిగితే దేశీయంగా గిరాకీ పుంజుకుంటుంద‌న్నారు. పేద వర్గాలపై అధిక ధ‌ర‌ల‌ను తగ్గించేందుకు కేంద్ర‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల‌ను సానుకూల ప‌రిణామంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మ‌రింత బూస్ట్ ను ఇవ్వ‌డానికి మరిన్ని రంగాల్లోకి విదేశీ పెట్టుబడుల్ని అనుమతించడాన్ని కూడా శ్రీనివాసన్‌ మంచి నిర్ణయంగా అభినందించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News