టీ20లో 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏమిటి? ఎప్పటినుంచి?

Update: 2022-09-18 23:30 GMT
కాలానికి తగ్గట్లుగా కొత్త ఫార్మాట్లను తీసుకురావటం.. దాంతో క్రికెట్ ను మరింత రంజుగా సిద్ధం చేయటం.. మరో ఆట వైపు కన్నెత్తి చూడకుండా చేయటంలో బీసీసీఐ ఎప్పటికప్పుడు సరికొత్తగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు టెస్టులు.. ఆ తర్వాత వన్డేలతో ఉన్న క్రికెట్ ఇప్పుడు ధనాధన్.. ఫటాపట్ అన్నట్లుగా తక్కువ సమయంలో ముగిసే టీ20 మ్యాచ్ లకు లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ ఫార్మాట్ స్టైల్ తో షురూ చేసిన ఐపీఎల్ టోర్నీ ఎంతలా హిట్ అయ్యిందన్నది తెలిసిందే.

టీ20 దెబ్బకు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ను మించిపోవటమే కాదు.. ఆదాయం విషయంలోనూ వందలాది కోట్ల రూపాయిల్ని తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. కాలానికి తగ్గట్లుగా మార్పులు ఆటలోనూ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇంతకీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఏమిటి? అందులో ఏముంటుంది? అదెప్పటి నుంచి షురూ కానుంది? కొత్త నిబంధనను టీ20లోకి ఎప్పుడు తేనున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

వాస్తవానికి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నుంచి ఐపీఎల్ లో అమలు చేయాలని అనుకున్నా.. ఆచరణలో సాధ్యం కాలేదు. తాజాగా అక్టోబరు 11 నుంచి జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను అమల్లోకి తీసుకురానున్నారు. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టే ఈ రూల్ సక్సెస్ అయితే.. ఐపీఎల్ టోర్నీలోనూ అమలు చేస్తారు. ఇప్పటికే ఈ కొత్త రూల్ గురించి ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు బీసీసీఐ మొయిల్ పంపింది.

ఇంతకీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఏంటి? దాని ప్రకారం ఏం జరుగుతుంది? దీనికున్న పరిమితులు ఏమిటి? దీంతో జట్లకు కలిగే ప్రయోజనం ఏమిటి? లాంటి ప్రశ్నలు బోలెడన్ని వస్తాయి. వీటికి సమాధానాల్ని వరుస పెట్టి చూస్తే..

అసలీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఏంటి?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో ఆటగాళ్లు ఎవరైనా గాయపడితే అతడి స్థానంలో సబ్ స్టిట్యూట్ రావటం తెలిసిందే. అలా వచ్చే ఆటగాడు బ్యాటింగ్.. బౌలింగ్ చేయటానికి వీలుండదు. కేవలం ఫీల్డ్ కు మాత్రమ పరిమితం అవుతాడు.చకానీ.. కొత్త రూల్ ప్రకారం జట్టులో ఎవరైనా గాయపడినప్పుడు కాకుండా.. మ్యాచ్ లో అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా ఒక ప్లేయర్ స్థానంలో మరొకరిని వ్యూహాత్మక సబ్ స్టిట్యూట్ గా తీసుకుంటారు. అలా వచ్చే ఆటగాడు బ్యాటింగ్ తో పాటు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తాడు.

ఎప్పుడంటే అప్పుడు పిలవొచ్చా?
సబ్ స్టిట్యూట్ ఆటగాడ్ని ఎప్పుడు పడితే అప్పుడు పిలవటానికి కుదరదు. 14వ ఓవర్ ముగిసేలోపు జరిగిపోవాలి.  అది కూడా ఒక ఓవర్ పూర్తయ్యాకే.

దీనికి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా?
రెండు సందర్భాల్లో ఈ రూల్ కు మినహాయింపులు ఉంటాయి.

1. ఏదైనా ఓవర్ మధ్యలో వికెట్ పడినప్పుడు బ్యాటింగ్ జట్టు తమ సబ్ ఆటగాడిని క్రీజ్ లోకి దించొచ్చు.

2. ఓవర్ మధ్యలో ఎవరైనా ఫీల్డర్ గాయపడితే కూడా ఫీల్గిండ్ జట్టు తమ సబ్ స్టిట్యూట్ ను పంపొచ్చు.

ఏ సందర్భాల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలు కాదు?
టీ20 మ్యాచ్ 20 ఓవర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే.. ఏదైనా కారణాలతో మ్యాచ్ ను 10 ఓవర్లకు కుదిస్తే మాత్రం ఈ కొత్త రూల్ అమల్లో ఉండదు. అయితే.. 17 ఓవర్లకు కుదిస్తే మాత్రం 13వ ఓవర్ కు ముందుగా మాత్రమే అమలవుతుంది.

మరి.. 11 ఓవర్లకు మ్యాచ్ కుదిస్తే?
ఒకవేళ అదే జరిగితే.. మ్యాచ్ 9 ఓవర్ కు ముందే ఈ మార్పు జరగాలి. అంతేకాదు.. సబ్ స్టిట్యూట్ విషయాన్ని ముందుగా ఫీల్డ్ అంఫైర్ కు తెలపాలి. అంతేకాదు.. టాస్ వేయటానికి ముందే తుది జట్టుతో పాటు నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్లను కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఇందులో ఒక్కరిని మాత్రమే మ్యాచ్ మధ్యలో ఎంపిక చేసుకునే వీలు ఉంది.

ఈ రూల్ తో జట్లకు కలిగే ప్రయోజనం ఏంటి?
టాస్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించే వీలుంది. ఏదైనా జట్టు టాస్ ఓడి.. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు బౌలింగ్ చేయాల్సి వస్తే.. ఆ సవాలును ఎదుర్కొనేందుకు తమ బౌలింగ్ దళంలో మార్పులు చేసుకునే వీలుంది. అంతేకాదు.. సెకండ్ బ్యాటింగ్ జట్టుకు టర్నింగ్ పిచ్ ఎదురైతే అదనపు బ్యాటరర్ ను కూడా జట్టులోకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
Tags:    

Similar News