అప్ డేట్స్:ఆ విషయాల్లో ఏమేం జరిగాయంటే?

Update: 2015-11-04 04:58 GMT
గత కొద్ది రోజులుగా జరిగిన వివిధ పరిణామాలకు సంబంధించిన లేటెస్ట్ గా మరికొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించి తాజా సమాచార సమాహారమిది.

1. తానిప్పటి వరకూ గొడ్డు మాంసం తినలేదని.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో అవసరమైతే గొడ్డు మాంసం తినటానికి సైతం వెనుకాడనంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాటల్ని తప్పు పడుతూ కర్ణాటక బీజేపీ నేత.. శివమొగ్గ మున్సిపల్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు ఎస్.ఎన్. చెన్నబసప్ప తీవ్ర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దమ్ముంటే సిద్దరామయ్య గోమాంసం తిని చూపాలి. అదే జరిగితే అతని తలను.. మొండెం వేరు చేస్తా అంటూ తీవ్రస్థాయిలో చేసిన వ్యాఖ్యలు మంటపుట్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చెన్న బసప్పను పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజా వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ.. సదరు నేతపై వేటు వేయాలని నిర్ణయించింది.

2. మద్యపానంపై గళమెత్తిన ప్రజా గాయకుడు కోవన్ పై దేశ ద్రోహం కేసు పెట్టమని తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దేశ ద్రోహం ఆరోపణల మీద అరెస్ట్ చేసిన కోవన్ పై దేశద్రోహం కేసు పెట్టమని తమిళనాడు అడ్వకేట్ జనరల్ మద్రాసు హైకోర్టుకు హామీ ఇచ్చారు.

3. గత ఏడాది డిసెంబరు 5న (ఒక రోజు తక్కువ ఏడాది) ఢిల్లీలో తన క్యాబ్ లో ప్రయాణిస్తున్న ఒక ఉద్యోగినిపై ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ అత్యాచారం చేసిన ఘటనపై ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో అతగాడిని దోషిగా నిర్దరించిన కోర్టు అజన్మంతం (సహజ మరణం చెందే వరకూ) జైలుశిక్షను విధించింది. దీంతో పాటు రూ.21వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

4. దశాబ్దానికి పైగా పాక్ లో ఉంటూ భారత్ కు వచ్చిన మూగబధిర యువతి గీత తమ కూతురే అంటూ చెబుతున్న యూపీ దంపతులు మంగళవారం ఇండోర్ లో గీతను కలిశారు. పాక్ నుంచి వచ్చిన ఆమెను ఇండోర్ లోని మూగ.. బదిర సంరక్షణాలయంలో ఉంచారు. గీత అసలు పేరు సవిత అని.. కావాలంటే తాము డీఎన్ఏ పరీక్షకు సిద్ధమని వారు చెబుతున్నారు.

5. ఆలిండియా సర్వీసు అధికారుల సర్వీసు కొత్త నిబంధనల ప్రకారం.. ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు తమ విధి నిర్వహణలో విదేశాలకు వెళ్లి నిర్ణీత వ్యవధికి మించి నెలకు పైగా తిరిగి రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

6. దేశంలో తీవ్ర అసహనం అలుముకున్నదంటూ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ పై బీజేపీ నేత విజయ్ వర్గీయ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ‘‘భారత్ లో నివసిస్తున్న షారుక్ ఆత్మ పాకిస్థాన్ లోనే ఉంటుంది.. దీన్ని ఏమనాలి? జాతి వ్యతిరేకి అని కాకుండా మరే పేరుతో పిలవాలి?’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

7. ఈశాన్య రాష్ట్రాలలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు చేయాలన్న డిమాండ్ తో మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం చాను షర్మిల చేస్తున్న నిరాహార దీక్షకు బుధవారంతో 15 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఇన్నేళ్లుగా ఆమెను పోలీసు నిర్బంధంలో ఆసుపత్రిలో ఉంచి.. ముక్కు ద్వారా ద్రవాహారం ఇస్తున్నారు.
Tags:    

Similar News