జగన్ స్పీడ్..కడప జిల్లాకు మరో ఉక్కు ఫ్యాక్టరీ

Update: 2020-03-05 18:30 GMT
నవ్యాంధ్రప్రదేశ్ కు కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టించేస్తున్నారని చెప్పక తప్పదు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పలు కంపెనీలు జగన్ రాకతో వెనక్కు వెళ్లిపోతున్నాయన్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోని జగన్... రాష్ట్ర భవిష్యత్తు కోసం తన మదిలో రూపొందించుకున్న ప్రణాళికలను వరుసగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తన సొంత జిల్లా కడప జిల్లాలో ఇప్పటికే ఓ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసే దిశలో సాగుతున్న జగన్... అదే జిల్లాలో మరో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా జగన్ గురువారం ఓ కీలక భేటీని నిర్వహించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ కు చెందిన కంపెనీ ఐఎంఆర్‌ ఏజీతో ఆయన సమావేశమయ్యారు.

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించిన ఐఎంఆర్ ఏజీ... ఆ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో గురువారం అమరావతి వచ్చిన కంపెనీ ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ తో భేటీ అయ్యారు. ఏడాదికి 10 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్‌ పెట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఇందుకోసం ఏకంగా రూ.12వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు తాము సిద్ధమని కూడా వారు జగన్ కు చెప్పారట. తాము పెట్టబోయే ప్లాంట్‌ కు నీరు - విద్యుత్‌ - ఇతర వసతులు కల్పించాలని కూడా వారు జగన్ న కోరారట. ఈ ప్రతిపాదనలకు సీఎం అక్కడికక్కడే సానుకూలంగా స్పందించినట్లు సీఎంఓ తెలిపింది. అంతేకాకుండా సదరు సంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని సీఎం జగన్‌ హామీనిచ్చారట.

ఇదిలా ఉంటే... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం భారీ యత్నాలు జరిగాయి. కర్ణాటకకు చెందిన బీజేపీ నేత - మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి... బ్రాహ్మణి స్టీల్స్ పేరిట కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. అందుకోసం వైఎస్ సర్కారు భూములను కేటాయించడం - ఇతరత్రా సౌకర్యాల ఏర్పాటు కోసం అనుమతులు మంజూరు చేయడం - గాలి జనార్దన రెడ్డి ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభం కావడం జరిగిపోయింది. అయితే అనుకోని పరిస్థితుల నేపథ్యంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోవడంతో ఆ నిర్మాణాలు ఆగిపోయాయి. తాజాగా జగన్ సీఎం అయ్యాక.. సదరు కంపెనీ పనులు మళ్లీ మొదలయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అదే సమయంలో ఇంకో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామంటూ స్విస్ కంపెనీ ముందుకు రావడం గమనార్హం.


Tags:    

Similar News