నోబెల్ నాకొద్దంటూ..ఇమ్రాన్ మాట‌ల్లో కొత్త కుట్ర ఇదే!

Update: 2019-03-04 09:22 GMT
పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల పెరిగిన ఉద్రిక్త‌త‌ల వేళ‌.. ఊహించ‌ని రీతిలో ఇమ్రాన్ చేసిన ప‌లు వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. ఇప్పటివ‌ర‌కూ పాక్ ప్ర‌ధానులుగా చేసిన వారి మాట‌ల‌కు భిన్న‌మైన రీతిలో ఆయ‌న వ్యాఖ్య‌లు సాగాయి. అంతేకాదు.. ఉద్రిక్త‌త‌ల వేళ‌.. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ప‌లువురి మ‌న్న‌న‌లు పొందాయి. అగ్ర‌రాజ్య‌మైన అమెరికా హెచ్చ‌రిక‌ల‌తో.. వారు చెప్పిన రీతిలో నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా ప్రచారం జ‌రిగినా... తీవ్ర‌మైన ఉద్రిక్త‌త‌ల న‌డుమ ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు హుందాగా ఉంద‌న్న మాట కొంద‌రి నోట వినిపించింది.

ఇదిలా ఉంటే.. భార‌త వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ద‌న్ ను భార‌త‌దేశానికి తిరిగి పంపాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న ఇమ్రాన్ నిర్ణ‌యంతో పాక్ లో ఆయ‌న ఇమేజ్ అమాంతంగా పెరిగిన‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఆయ‌న నిర్ణ‌యంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌న్న వాద‌న వినిపించింది. దీనికి తోడు ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన నోబెల్ శాంతి బ‌హుమ‌తిని ఆయ‌న స్వీక‌రించ‌టానికి అర్హుడంటూ పాక్ పార్ల‌మెంటు తీర్మానించింది.

ఇలాంటివి చోటు చేసుకున్న‌ప్పుడు స్పందించే తీరుకు భిన్నంగా తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్య‌లు చేసి మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించారు. తాను నోబెల్ శాంతి బ‌హుమ‌తికి అర్హుడ్ని కాద‌ని.. ఎందుకంటే త‌న‌కు ఆ సామ‌ర్థ్యం లేద‌న్నారు. క‌శ్మీర్ వివాదాన్ని క‌శ్మీరీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌రిష్క‌రించి ఉప‌ఖండంలో శాంతి.. మాన‌వ వికాసానికి బాట‌లు ప‌రిచే వ్య‌క్తి మాత్ర‌మే ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుకు అర్హుడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇందుకు త‌గిన‌ట్లు ఆయ‌న ట్వీట్ తో పేర్కొన్నారు.

పుల్వామా ఉగ్ర‌దాడి అనంత‌రం.. అందుకు ప్ర‌తిగా ఆక్ర‌మిత క‌శ్మీర్ లోనూ.. పాక్ భూభాగంలోని జేషే ఎ మ‌హ్మ‌ద్ ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త్ మెరుపుదాడులు నిర్వ‌హించ‌టం.. దాంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తీవ్రం కావ‌ట‌మే కాదు.. రెండు దేశాల న‌డుమ యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి.

ఇదే స‌మ‌యంలో వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ పాక్ సైన్యానికి చిక్క‌టం.. అనంత‌రం ఆయ‌న్ను భార‌త్ కు పంపేందుకు పాక్ పార్ల‌మెంటు ఏక‌గ్రీవ తీర్మానం చేయ‌టంతో రెండు దేశాల మ‌ధ్య సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనే మార్గ సుగ‌మం అయ్యింది. ఇది జ‌రిగిన వెంట‌నే ఇమ్రాన్ ను నోబెల్ శాంతి బ‌హుమ‌తికి అర్హుడంటూ పాక్ పార్ల‌మెంటు మ‌రో తీర్మానాన్ని చేసింది. అయితే.. ఆ తీర్మానానికి పొంగిపోకుండా విన‌మ్ర‌త‌తో ఆయ‌న స్పందించిన తీరు ఇమ్రాన్ మీద మ‌రింత గౌర‌వం పెంచేలా చేసింద‌ని చెప్పాలి. అయితే.. ఇందులో ఒక కిటుకు కూడా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌శ్మీర్ లో భార‌త ప్ర‌భుత్వం మీద ఆగ్ర‌హం ఉంది. అలాంటి వేళ‌.. క‌శ్మీరీల అభిప్రాయాల‌కు త‌గ్గ‌ట్లుగా కశ్మీర్ ఇష్యూ క్లోజ్ చేయాల‌ని చెప్ప‌టం ద్వారా ఇమ్రాన్ తెలివిని ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి.

త‌న మాట‌ల‌తో అంద‌రి మ‌న‌సుల్ని ఆక‌ట్టుకునేలా ఇమ్రాన్ ట్వీట్ చేసినట్లు పైకి క‌నిపించినా.. ఆయ‌న క‌శ్మీరీల మ‌నుసుల్ని దోచుకునేలా పావులు క‌దుపుతున్నారు. గ‌తంలోని పాల‌కులు క‌శ్మీర్ పాక్ ద‌ని వాదించేవారు. కానీ.. ఇమ్రాన్ మాత్రం వారి మ‌న‌సుకు న‌చ్చిన‌ట్లుగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్ప‌టం ద్వారా.. క‌శ్మీరీల ఆత్మ‌బంధువుగా మారాల‌న్న‌ట్లుగా ఇమ్రాన్ ఆలోచ‌న‌గా ఉంది. ఎప్పుడైతే తాను క‌శ్మీరీల మ‌న‌సుల్ని దోచుకుంటానో.. అప్పుడు భార‌త్ ను మ‌రింత ఇరుకున ప‌డేయాల‌న్న మాయాలోచ‌న‌తోనే తాజా ట్వీట్ ఉంద‌ని చెప్పాలి. వార్ కంటే కూడా మైండ్ గేమ్ తో భార‌త్ ను ఇబ్బంది పెట్టేలా ఇమ్రాన్ అడుగులు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
   

Tags:    

Similar News