ఇమ్రాన్ మూడో భార్య ఆమేనా?

Update: 2016-07-13 05:34 GMT
ఇటీవల ఒక ఇంగ్లిషు పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా లైఫ్ బోర్ కొడుతోందని.. మూడో పెళ్లి చేసుకోవాలన్న మనసులోని మాటను పాక్ మాజీ క్రికెటర్.. పాకిస్థాన్ లో తెహ్రిక్ – ఇ – ఇన్సాప్ పార్టీ చీఫ్ అయిన ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించటం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన సంగతి తెలిసిందే. 63 ఏళ్ల వయసులో ఇప్పటికే రెండు పెళ్లిళ్లు ఫెయిల్ అయినప్పటికీ.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లుగా ఇమ్రాన్  పేర్కొన్నట్లుగా ఇంటర్వ్యూ స్పష్టం చేసింది.

ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన నేపథ్యంలో తాజాగా పాక్ కు చెందిన దునియా న్యూస్ అనే మీడియా సంస్థ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేసింది. ఇమ్రాన్ కు మూడో పెళ్లి ఇప్పటికే అయిపోయిందని తేల్చింది. ఇటీవల లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇమ్రాన్ పెళ్లి చేసుకన్నట్లుగా చెప్పిన సదరు మీడియా సంస్థ.. పెళ్లి కూతురి వివరాల్ని కూడా వెల్లడించటం గమనార్హం.

ఇమ్రాన్ మూడో భార్య ఎవరో కాదని.. ఆయనకు మత గురువుగా వ్యవహరిస్తున్న బుష్రా సోదరేనని పేర్కొంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుందని.. ఆమె పంజాబ్ ప్రావిన్సులో ఉంటారని పేర్కొంది. ఆమె పేరును మరియంగా  వెల్లడించింది. అయితే.. ఈ కథనంపై ఇమ్రాన్ ట్విట్టర్ లో స్పందించారు. తాను పెళ్లి చేసుకోలేదని.. సదరు వార్త తప్పని.. ఒకవేళ తాను మూడో పెళ్లి చేసుకునే పక్షంలో అందరికి చెప్పే చేసుకుంటానని చెప్పటం గమనార్హం. ఇంతకీ.. ఇమ్రాన్ మూడో భార్య ఎవరు..?
Tags:    

Similar News