ఇమ్రాన్ రాజకీయం గాల్లో బంతి !

Update: 2022-04-01 06:30 GMT
పాకిస్ధాన్ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. గురువారం ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం అమలవుతుందని, ఇమ్రాన్ రాజీనామా చేయకతప్పదని అందరు అనుకున్నారు. అయితే అనూహ్యంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ ఆదివారానికి వాయిదాపడింది. పార్లమెంటు ప్రారంభంకాగానే అజెండా ప్రకారం అంశాలను కాకుండా అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టారు.

 అయితే డిప్యుటీ స్పీకర్ ఖాసీం సూరి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం అజెండాలో నాలుగో అంశం కాబట్టి వరస ప్రకారమే చర్చలు జరుగుతుందని చెప్పటంతో పెద్ద గందరగోళం జరిగింది. దీంతో సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవటంతో సభను ఆదివారానికి డిప్యుటీ స్పీకర్ వాయిదా వేశారు. దాంతో ఇమ్రాన్ రాజీనామాపై సస్పెన్స్ మరో రెండు రోజులు వాయిదా పడింది.

 ప్రస్తుతం ఇమ్రాన్ పరిస్థితి ఎలాగుందంటే స్వపక్షంలోని ఎంపీలు 24 మంది రాజీనామా చేశారు. ముగ్గురు మంత్రులు కూడా మంత్రివర్గం నుండి బయటకు వచ్చేశారు. ఇదే సమయంలో ఇంత కాలం అండగా ఉన్న మిత్రపక్షాలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి.

ఇదే సమయంలో పాకిస్థాన్ సైన్యం ప్రధానిని రాజీనామా చేయమంటు ఒత్తిడి పెంచేస్తున్నది. సైన్యాధికారులను కాదని పాకిస్థాన్ లో ప్రధానమంత్రి ఏమీ చేయలేరని అందరికీ తెలిసిందే.

 ఏ కోణంలో చూసుకున్నా ఇమ్రాన్ ఎక్కువ రోజులు పదవిలో కంటిన్యూ అవకాశాలు కనబడటం లేదు. రోజురోజుకు దేశంలో పరిస్థితులు దుర్భరంగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు ఎక్కడా కనబడటం లేదు. దీంతో ఇమ్రాన్ రాజీనామాపై అన్నీ వైపుల నుండి ఒత్తిళ్లు బాగా పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా ఇమ్రాన్ పై మండిపడుతున్న అమెరికా అన్ని రకాలుగా తన మద్దతును ఉపసంహరించుకుంటోంది. ఇమ్రాన్ అధికారంలో ఉన్నంత వరకు విదేశీ వ్యవహారాలు ఇలాగే ఉంటాయని అమెరికా చెప్పడం విచిత్రంగా ఉంది. మరి చివరకు ఇమ్రాన్ భవిష్యత్తు ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News