థియేటర్లలో జాతీయగీతం పాడనక్కర్లేదంట

Update: 2015-12-02 09:42 GMT
ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటుంది. అంతమాత్రం చేత చట్టాల్ని కూడా గౌరవించని వైనం ఈ మధ్య ఎక్కువైంది. అదేమంటే.. మనసులో ఉన్న మర్యాదను.. బయటకు ప్రదర్శిస్తే తప్ప మర్యాద ఉన్నట్లు అనిపించదా? అంటూ చిత్రమైన వాదనను వినిపిస్తున్నారు. నిజమే.. ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన ఉండి.. నిబంధనల్ని పాటించకపోతే అది చట్ట విరుద్ధమవుతుందన్న విషయం తెలిసినా.. ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన ఉన్న వాడు.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలా? అని అడిగితే ఎంత చిత్రంగా ఉంటుందో.. తాజాగా అలాంటి వాదనను వినిపిస్తున్నారు కొందరు నేతలు.

సినిమా హాళ్లలో జాతీయగీతాన్ని ఆలపించే సమయంలో లేచి నిలబడాలన్నది మహారాష్ట్రలో ఒక రూల్. అయితే.. సినిమా హాలుకు వెళ్లేది వినోదం కోసం కాబట్టి.. ఈ జాతీయ గీతాలు ఆలపించాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నతో పాటు.. దేశభక్తి నిరూపించుకోవటానికి లేచి నిలుచోవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇలాంటి వాదననే వినిపిస్తున్నారు మజ్లిస్ ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్. మహారాష్ట్రకు చెందిన ఈ మజ్లిస్ ఎంపీ.. థియేటర్లలో జాతీయగీతం పాడాల్సిన అవసరం లేదంటూ తేల్చేస్తున్నారు.

ఇటీవల ముంబయిలోని ఒక సినిమా థియేటర్ లో సినిమాకు ప్రారంభంలో జాతీయ గీతాన్ని ఆలపించటం.. ఆ సమయంలో ఒక కుటుంబం నిలుచోపోవటంతో వారిని థియేటర్ నుంచి పంపించేయటం వివాదంగా మారింది. థియేటర్ కు వెళ్లేది వినోదం కోసం అయినప్పుడు.. దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్న మజ్లిస్ ఎమ్మెల్యే.. తాను జాతీయ జెండాను ప్రేమిస్తానని.. అలా అని మరొకరి ముందు దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దేశ భక్తి ఉన్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తే మాత్రం తప్పేంటి? ఇంట్లో అమ్మను.. అమ్మా అని పిలిచినప్పుడు బయట పిలవటానికి నామోషీ అవసరం లేదు కదా. బయట అమ్మా అని పిలవకపోతే.. అమ్మ కాకుండా పోతుందా? అన్న చందంగా మజ్లిస్ ఎమ్మెల్యే మాటల్లేవు. ఒకవేళ.. థియేటర్లలో జాతీయ గీతం అవసరం లేదంటే.. ఆ విషయాన్ని కోర్టుల వద్దకు వెళ్లి.. చట్టాన్ని తీసేయిస్తే.. మరింత బాగుంటుంది. అంతేకానీ.. చట్టాన్ని అనుసరించకుండా స్వేచ్ఛ పేరుతో వ్యాఖ్యలు చేయటం సరికాదన్న విషయం మజ్లిస్ ఎమ్మెల్యే గుర్తుంచుకుంటే మంచిది.
Tags:    

Similar News