అవాక్కు అయ్యేలా అద్వానీ మౌనం లెక్క‌లు!

Update: 2019-02-09 05:40 GMT
అద్వానీ పేరు విన్నంత‌నే చాలామంది క‌మ‌ల‌నాథుల ముఖాలు వెలిగిపోతాయి. మోడీ లాంటి ప్ర‌జాక‌ర్ష‌క శ‌క్తి ముందు కూడా అద్వానీ అంటే అమితాశ‌క్తి ప్ర‌ద‌ర్శించే క‌మ‌ల‌నాథుల‌కు కొద‌వ లేదు. క‌మ‌ల‌వికాసానికి కీల‌క‌భూమిక పోషించిన అద్వానీ మోడీ హ‌యాంలో మౌనంగా ఉంటుంద‌న్నారు. ఆ మాట‌కు వ‌స్తే మౌన వ్ర‌తం చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. లోక్ స‌భ‌లో మొద‌టివ‌రుస‌లో కూర్చున్న‌ప్ప‌టికి గ‌డిచిన ఐదేళ్ల‌లో ఆయ‌న మాట్లాడిన ప‌దాల లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వ హ‌యాంతో పోలిస్తే.. మోడీ ప్ర‌భుత్వంలో అద్వానీ అస్స‌లు మాట్లాడ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న వాగ్దాటితో దేశం మొత్తం తిర‌గ‌ట‌మే కాదు.. బీజేపీకి ఒక గుర్తింపు తెచ్చి పెట్టిన పెద్ద మ‌నిషి గ‌డిచిన ఐదేళ్ల కాలంలో మౌన‌మునిలా ఉండిపోయారు. మౌన ప్ర‌ధానిగా మ‌న్మోహ‌న్ సింగ్ ను ప‌లువురు వ్యంగ్య వ్యాఖ్య‌లు చేస్తుంటారు.

తాజాగా అద్వానీ మౌనాన్ని అంకెల్లో చూసిన‌ప్పుడు మ‌న్మోహ‌న్ చాలా ఎక్కువ‌గా మాట్లాడిన‌ట్లుగా అనిపించ‌క మాన‌దు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అద్వానీ కేవ‌లం 365 ప‌దాలు మాత్ర‌మే మాట్లాడిన‌ట్లుగా లెక్క తేల్చారు.

మ‌న్మోహ‌న్ ప్ర‌ధానిగా ఉన్న వేళ 2012 ఆగ‌స్టు 8న అసోంలో అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై మాట్లాడిన ఆయ‌న‌.. తాను చెప్పాల్సిన మాట‌ల్ని చెప్పేందుకు చాలానే క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.నాటి అధికార స‌భ్యులు త‌న ప్ర‌సంగానికి దాదాపు 50 సార్లు అడ్డు ప‌డినా.. వెన‌క్కి త‌గ్గని ఆయ‌న వారిని నిలువ‌రించి మ‌రీ తాను చెప్పాల్సిందంతా చెప్పి కానీ త‌న ప్ర‌సంగాన్ని ముగించ‌లేదు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న 4957 ప‌దాల్ని మాట్లాడారు.

ఈ ప్ర‌సంగం వెలుగులోకి తెచ్చిన ఇష్యూ ప‌రిష్కారానికే పౌర‌స‌త్వ బిల్లును తెస్తున్న‌ట్లుగా మోడీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  ఆస‌క్తిక‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. గ‌తంలో అద్వానీ చెప్పిన అంశానికి సంబంధించిన బిల్లును గ‌త నెల 8న లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఆ స‌మ‌యంలో అద్వానీ స‌భ‌లో ఉన్నా ఒక్క మాట మాట్లాడ‌లేదు. మ‌రో విష‌యం ఏమంటే.. 2014 డిసెంబ‌రు 29 త‌ర్వాత ఆయ‌న లోక్ స‌భ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని చెబుతున్నారు. మొదటి వ‌రుస‌లో కూర్చొని కూడా మారు మాట్లాడ‌కుండా ఉన్న అద్వానీ త‌న మౌన వ‌త్రాన్ని ఎప్ప‌టికి వీడ‌తారో చూడాలి.
Tags:    

Similar News