సీఎం సిద్ధూకు అవ‌మానం !

Update: 2018-05-15 08:35 GMT
ఇటీవ‌ల బీజేపీ-టీడీపీ గొడ‌వ‌తో క‌ర్ణాట‌క రాజ‌కీయాలు తెలుగువారికి ఇంకాస్త ప‌రిచ‌యం అయ్యాయి. కానీ ఈ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోటీ వ‌ల్ల ఈరోజు వ‌ర‌కు అంద‌రూ అయోమ‌యంలో ప‌డ్డారు. బీజేపీ గెల‌వ‌డం చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లిగించింది కానీ... సిద్ధరామ‌య్య ఎలా గెలుస్తాడు? అన్న క్లారిటీ లేకుండానే సిద్ధూ గెల‌వాల‌ని చాలామంది తెలుగు వారు కోరుకున్నారు. నిజానికి ఆయ‌న‌పై ప్రేమ‌కాదు, బీజేపీపై కోపం అంతే. అయితే, చివ‌ర‌కు రెండు స్థానాల్లో పోటీచేసిన సిద్ధ‌రామ‌య్య చివ‌ర‌కు ఒక స్థానంలో ఓడిపోయి.. రెండో స్థానంలో అతి త‌క్కువ మెజారిటీతో గెలిచాడు. ఇంత‌కీ ఈ సిద్ధ‌రామ‌య్య ఎవ‌రో తెలుసా?

సిద్ధ‌రామ‌య్య‌... మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ నేత దేవేగౌడ శిష్యుడు. ఇది చ‌రిత్ర‌. కానీ ఇపుడు వారు బ‌ద్ధ శ‌త్రువులు. ఎందుకంటే గ‌తంలో సిద్ధ‌రామ‌య్య జేడీఎస్ లోనే ఉండేవారు. 1978లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఇపుడు ఓడిపోయిన ఛాముండేశ్వ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1983లో సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత జ‌నతా పార్టీలో చేరారు. ఆ  త‌ర్వాత జేడీఎస్‌లో చేరి దేవెగౌడ శిష్యుడిగా మారారు. జ‌న‌తాద‌ళ్ లో చీలిక వ‌చ్చిన‌పుడు దేవెగౌడ శాఖ‌లో చేరిన సిద్ధ‌రామ‌య్య ఆ పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడు అయ్యాడు. అయితే, కొడుకు కుమార‌స్వామిని సీఎం చేయాల‌నుకున్న దేవెగౌడ క‌ల‌కు అడ్డం ప‌డ‌టంతో సిద్ధ‌రామ‌య్య‌పై దేవెగౌడ కోపం పెంచుకున్నారు. అందుకే ఆ వైరం వ‌ల్లే ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ - జేడీఎస్ పొత్తు ప్ర‌స్తావ‌నే రాలేదు. క‌ర్ణాట‌క‌లో ఎలాగూ బీజేపీకి జేడీఎస్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌నేది దాదాపు స్ప‌ష్ట‌మైపోయింది.

ఇదిలా ఉండ‌గా... కొడుకును గెలిచిపించ‌డం కోసం త‌న కంచుకోట *వ‌రుణ‌* నియోజ‌క‌వ‌ర్గాన్ని కొడుక్కి ఇచ్చిన సిద్ధ‌రామ‌య్య త‌న మొద‌టి నియోజ‌క‌వ‌ర్గం అయిన చాముండేశ్వ‌రి నుంచి పోటీ చేశారు. అయితే, నామినేష‌న్ వేసిన స‌మ‌యానికే నియోజ‌క‌వ‌ర్గంలో తాను గెలిచే అవ‌కాశం లేద‌ని అర్థ‌మైన సిద్ధూ బాదామి నుంచి కూడా పోటీ చేశారు. అయితే, ఇక్క‌డ కూడా బీజేపీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థి అయిన శ్రీ‌రాములు పోటీలో నిలిచారు. పొద్దున కౌంటింగ్ మొద‌లైన‌పుడు రెండు స్థానాల్లో వెనుక‌ప‌డిన సిద్ధ‌రామ‌య్య భ‌య‌ప‌డ్డారు. అయితే, భ‌య‌ప‌డింది నిజ‌మైంది. ఛాముండేశ్వ‌రిలో ఓడిపోయారు. దేవెగౌడ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆయ‌నను ఓడించి త‌న రివెంజ్ తీర్చుకున్నారు. అయితే, క‌న్నుపోయి ప్రాణం ద‌క్కిన‌ట్టు కేవ‌లం మూడు నాలుగు వేల మెజారిటీతో బాదామిలో బీజేపీ అభ్య‌ర్థి శ్రీ‌రాములుపై విజ‌యం సాధించారు. అయితే, శ్రీ‌రాములు కూడా మ‌రో స్థానం నుంచి కూడా పోటీ చేశారు. ఓబుళాపురంకు ద‌గ్గ‌ర‌లోని మొల‌కాల్మూరు నియోజ‌క‌వ‌ర్గంలో శ్రీ‌రాములు గెలిచారు. దీంతో రెండు పార్టీల‌కు చెందిన‌ ఇద్ద‌రు కీల‌క నేత‌లు సేఫ్ జోన్లో ప‌డ్డారు.


Tags:    

Similar News