పోలీస్.. ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన ఢిల్లీ సర్కార్

Update: 2019-09-05 05:17 GMT
కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురాలేదు. సవరించిన జరిమానాల ప్రకారం.. వాహనదారులు చేసే తప్పులకు.. నిబంధనల్ని ఉల్లంఘించినందుకు భారీ జరిమానాలు కట్టేలా కొత్త చట్టాన్ని చేయటం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్న కొత్త చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో.. పలువురు వాహనదారులకు దిమ్మ తిరిగిపోయే షాకులు తగులుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ చట్టానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే పోలీసు.. ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ (రెట్టింపు) జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వ్యక్తిగత వాహనాల్ని.. ప్రభుత్వ వాహనాల్ని పోలీసులు.. ప్రభుత్వ అధికారులు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ మీనూ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. వాహనాల్ని నడిపే సమయంలో సిగ్నల్ జంప్ చేసినా.. హెల్మెట్ ధరించకున్నా.. రాంగ్ పార్కింగ్ లో వాహనాల్ని పెట్టినా.. కారు సీటు బెల్ట్ పెట్టుకోకున్నా డబుల్ జరిమానాను విధిస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటికే కొత్త జరిమానాలతో గగ్గోలు పెడుతున్న ప్రజలకు.. ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఒకింత ఉపశమనంగా మారుతుందన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే.. సామాన్య ప్రజలు రూల్స్ అన్ని ఫాలో కావాలని.. కానీ పోలీసులు.. ప్రభుత్వ ఉన్నదాధికారులు పలువురు తమకు నిబంధనలేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తారని.. ఇలాంటి వాటి విషయంలో ఢిల్లీ సర్కారు సరైన నిర్ణయం తీసుకుందన్న మాట వినిపిస్తోంది.

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీ రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులకు గత ఏడాది 250 మందికి జరిమానాలు విధించామని.. ఈ ఏడాది  ఇప్పటివరకూ 100 మందికి ఫైన్లు వేసినట్లు చెబుతున్నారు. రూల్ అంటే రూలే. అందరికి ఒకేలా ఉండటం.. కొన్ని సందర్భాల్లో సామాన్య ప్రజల కంటే ఎక్కువ పరిమితులు పోలీసులు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ తరహా నిర్ణయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయగలరా?
Tags:    

Similar News