హుజూర్ నగర్ లో రెడ్ల గోల మామూలుగా లేదబ్బా

Update: 2019-10-19 18:11 GMT
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో నిజంగానే రెడ్డిగారి గోల మామూలుగా లేదనే చెప్పాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు రెడ్లు కలిసి రెడ్డి వర్గానికి చెందిన మహిళ గెలుపు కోసం మనస్పర్థలన్నీ పక్కనపెట్టేసి ఒక్కటి కాగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కూడా రెడ్డి వర్గానికే చెందిన నేత బాధ్యతనంతా భుజాన వేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పోటీ కూడా ఈ రెండు పార్టీల మధ్యేనని కూడా చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి... కాంగ్రెస్ లోని ముగ్గురు రెడ్లపై ఓ రేంజిలో ధ్వజమెత్తారు. ఎన్నికలు ముగియగానే... కాంగ్రెస్ గెలుపు కోసం ఒక్కటి అయిన ముగ్గురు రెడ్లలో ఇద్దరు రెడ్లు రోడ్డెక్కి మరీ కొట్టుకుంటారంటూ పల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయాయి.

టీఆర్ఎస్ తరఫున పల్లా రంగంలోకి దిగితే.. కాంగ్రెస్ గెలుపు కోసం నిన్నటిదాకా ఎడముఖం పెడముఖంగా ఉన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు ఏకమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ చెప్పుకొచ్చిన పల్లా... ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో తలెత్తే పరిస్థితిపై తనదైన శైలి విశ్లేషణ వినిపించారు. ఉప ఎన్నిక అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్  ఊడిపోతుందని పల్లా జోస్యం చెప్పారు. రేవంత్, కోమటిరెడ్డి పీసీసీ పదవి కోసం రోడ్ల మీద పడి కొట్టుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి హుజూర్‌నగర్ ప్రజలను రెచ్చగొట్టేలా, అవమానించేలా మాట్లాడారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడైన సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని హుజూర్‌నగర్‌ ప్రజలంతా మనసారా కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఇక హూజూర్ నగర్ బైపోల్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సైదిరెడ్డి కూడా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘ఈ ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి అభివృద్ధి నిరోధక ఉత్తమ్ కుటుంబానికి వచ్చిన ఉప ఎన్నిక. ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా. ప్రజలంతా గమనిస్తున్నారు. ఉత్తమ్ అహంకారానికి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పద్మావతి రెడ్డికి ఘోర  పరాజయం తప్పదు. హుజూర్‌నగర్‌ అభివృద్ధి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు హుజూర్‌నగర్‌ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో ఉత్తమ్ కాంగ్రెస్ లీడర్లందరినీ ఇక్కడకు రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నా పై ఉత్తమ్ చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే ఉత్తమ్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి’అని సైదిరెడ్డి ఓ రేంజిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News