ఐటీ అధికారుల కారణంగానే సిద్దార్థ సూసైడ్?

Update: 2019-07-31 07:26 GMT
దేశంలో ఇప్పటివరకూ ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్నాయి. కానీ.. గతంలో ఎప్పుడూ చూడని.. వినని సూసైడ్ వ్యవహారంగా దీన్ని చెప్పాలి. కార్పొరేట్ ప్రముఖుడి ఆస్తుల్ని చేజిక్కించుకోవటం కోసం జరిగిన గేమ్ లో.. ఒత్తిడిని భరించలేక కేఫ్ కాపీడే సీఎండీ ప్రాణాల్ని వదిలేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.  దేశ కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారిన సిద్దార్థ ఆత్మహత్య వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బయటకు వచ్చిన విషయాలు చాలా తక్కువని.. వెలుగు చూడాల్సిన నిజాలు చాలానే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కొన్ని వ్యవస్థల కారణంగా ప్రాణాలు తీసుకునే వరకూ వెళ్లటం ఏ మాత్రం సరికాదన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఈ ధోరణికి వెంటనే కట్టడి చేయాలని.. లేకుంటే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ఒక పేరెన్నికగన్న వ్యాపారవేత్త ఒత్తిడితో.. అప్పుల వేదనతో ఆత్మహత్య చేసుకోవటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ వెతుకులాట అనంతరం సిద్దార్థ డెడ్ బాడీని నేత్రావతి నదిలో గుర్తించారు. ఆయన సూసైడ్ ఎపిసోడ్ లో పలువురు ఐటీ అధికారుల వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కేఫ్ కాఫీడేకు వేల కోట్ల అప్పులు ఉన్నాయని.. వాటిని తీర్చటానికి సిద్దార్థ చేసిన ప్రయత్నాల్ని రూల్స్ పేరుతో ఐటీ అధికారులు అడ్డుకున్నారని.. అదే పనిగా వేధింపులకు గురి చేయటంతో ఆయన సూసైడ్ చేసుకోవటానికి కారణమయ్యారంటున్నారు.

కేఫ్ కాఫీ డేకు ఉన్న అప్పుల్ని  తీర్చటానికి సిద్దార్థ మైండ్ ట్రీ అనే కంపెనీలో తనకున్ షేర్లను రూ.3వేల కోట్లకు అమ్మేసుకున్నారు. అయితే.. ఈ ఒప్పందానికి కొర్రీలు పెట్టిన ఐటీ శాఖ.. మైండ్ ట్రీ షేర్లను సీజ్ చేశారు. ఆదాయపన్ను చెల్లిస్తానని చెప్పినా సీజ్ చేయటంతో సిద్ధార్థ ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. ఐటీ శాఖ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటానికి కారణం.. కనీసం నోటీసులు ఇవ్వకుండానే రూ.3వేల కోట్ల మైండ్ ట్రీ షేర్లను ఎలా సీజ్ చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కేవలం రూ.625 కోట్ల పన్ను కోసం రూ.3వేల కోట్ల షేర్లను సీజ్ చేయటం వ్యాపార వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా డీల్ ను అడ్డుకోవటానికి.. సిద్దార్థ కంపెనీని కారుచౌకగా చేజిక్కించుకోవటానికి వీలుగా ప్లాన్ చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఐటీ అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లుగా చెబుతున్నా.. పలువురు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..కేఫ్ కాఫీ డే ఛైన్ నుకోకకోలాకు అమ్ముకునేందుకు రెఢీ అయిన వేళలో ఆ కంపెనీ షేర్లను కూడా సీజ్ చేయటం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం రావట్లేదు. మొత్తంగా.. సిద్దార్థ సూసైడ్ వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి ఐటీ శాఖ మీదకు వచ్చేటట్లుగా కనిపిస్తోంది. మరి.. ఐటీ శాఖను అంతలా ప్రభావితం చేసిన వారెవరు?  వారే ప్రయోజనం కోసం ఇదంతా చేశారు?  అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.


Tags:    

Similar News