చిన్న‌మ్మపై సోదాల‌కు కార్ల అద్దె అంత అయ్యిందా?

Update: 2017-11-13 04:25 GMT
సోదాలంటే సోదాలు. మ‌హా సోదాలు. ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా ఎన్నో ఐటీ త‌నిఖీలు చూశాం కానీ.. త‌మిళ‌నాడు చిన్న‌మ్మ శ‌శిక‌ళ అండ్ కో మీద జ‌రుగుతున్న త‌నిఖీల ప‌ర్వం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగో రోజు కూడా ఐటీ అధికారులు దాడులు చేప‌ట్టారు. శ‌శిక‌ళ కుటుంబ స‌భ్యులు.. బంధువులు.. స్నేహితుల ఇళ్ల మీద ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా సోదాలు చేప‌డుతున్నారు.

ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున అక్ర‌మాస్తులు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. తీగ లాగితే డొంక అంతా కదులుతున్న‌ట్లుగా చిన్న‌మ్మ ప‌రివారానికి సంబంధించిన ఆర్థిక మూలాల‌పై భారీ ఎత్తున త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది. చివ‌ర‌కు చిన్న‌మ్మ జ్యోతిష్యుల ఇళ్ల మీదా అధికారులు త‌నిఖీలు చేప‌డుతున్నారంటే ఎంత లోతుగా సాగుతుందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

పెళ్లి వాహ‌నంగా భ్ర‌మించేలా స్టిక్క‌ర్లు అంటించుకొని మ‌రీ సోదాల‌కు వ‌చ్చిన ఆదాయ‌ప‌న్ను అధికారుల‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. శ‌శిక‌ళ కుటుంబీకుల ఇళ్లు.. కార్యాల‌యాలు.. త‌నిఖీల కోసం చెన్నైలోని ఫాస్ట్ ట్రాక్ అనే సంస్థ నుంచి ఐటీ అధికారులు ఐదు రోజుల ముందే 160 కార్లు అద్దెకు తీసుకున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతేనా ఈ కార్ల కోసం 15 గంట‌ల ప్యాకేజీతో మాట్లాడుకున్న నేప‌థ్యంలో.. అద్దె కోస‌మే రూ.6.88ల‌క్ష‌లు చెల్లించారు.  ఐటీ అధికారుల కార్ల అద్దెకే ఇంత ఖ‌ర్చు చేస్తే.. సోదాల నేప‌థ్యంలో ఎన్ని వంద‌ల కోట్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆదివారం నిర్వ‌హించిన త‌నిఖీల సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. చెన్నై అశోక్ న‌గ‌ర్ లోని శ‌శిక‌ళ సోద‌రుడి కుమారుడైన జ‌యా టీవీ నిర్వాహ‌కుడు వివేక్ కుమారుడి ఇంటి ద‌గ్గ‌ర ఐటీ అధికారులు రూ.15 కోట్ల విలువైన జాగ్వార్ కారును స్వాధీనం చేసుకున్నారు. అంతేనా.. శ‌శిక‌ళ బంధువు ఇంటి వ‌ద్ద ఉన్న ల‌గ్జ‌రీ కారు డిక్కీలో ఉంచి రూ.2 కోట్ల న‌గ‌దును అధికారులు గుర్తించారు. ఈ భారీ మొత్తంతో పాటు మూడున్న‌ర స‌వ‌ర్ల బ‌రువున్న 20 బంగారు బ్రేస్ లెట్ల‌ను అధికారులు గుర్తించారు.

శ‌శిక‌ళ కుటుంబీకుల అస్థాన జ్యోతిష్యుడిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని శ‌నివారం రాత్రి నుంచి ఆదివారం తెల్ల‌వారుజాము వ‌ర‌కూ విచారించిన‌ట్లుగా చెబుతున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో దిన‌క‌ర‌న్ తో పాటు ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో ఉన్న శ‌శిక‌ళ‌ను అధికారులు ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఓప‌క్క ఐటీ అధికారుల త‌నిఖీలు ఇంత పెద్ద ఎత్తున జ‌రుగుతుంటే.. మ‌రోవైపు దిన‌క‌ర‌న్ తిరువ‌ణ్ణామ‌లై ఆల‌యంలో కుటుంబ స‌మేతంగా పూజ‌లు నిర్వ‌హించ‌టం గ‌మ‌నార్హం. ఐటీ దాడుల వెనుక ప‌న్నీర్ సెల్వం.. ప‌ళ‌నిస్వామిల హ‌స్తం ఉంద‌ని దిన‌క‌ర‌న్ ఆరోపిస్తున్నారు.  తాజా ప‌రిణామాలు చూస్తున్న‌ప్పుడు దిన‌క‌ర‌న్ ఆరోప‌ణ‌ల్లో ఎంతోకొంత నిజం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News