కరోనా డేంజర్‌ బెల్స్.. ఒక్కరోజే 8 వేలకు పైగా కేసులు

Update: 2022-06-11 07:29 GMT
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా మళ్లీ విస్తరిస్తోంది. రోజురోజుకు నమోదవుతున్న కేసుల సంఖ్యని చూస్తుంటే మరోసారి డేంజర్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ.. స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. లేనియెడల మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నాయి.

దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులు చూస్తుంటే నాలుగో దశ మొదలైనట్లే కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 8,329 మంది వైరస్ బారిన పడ్డారు. 10 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. శుక్రవారం 4,216 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.69 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది.

మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.41 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 1.75 శాతంగా ఉంది. సుమారు 103 రోజుల తర్వాత దేశంలో 8 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. భారత్లో శుక్రవారం 15,08,406 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,92,71,111 చేరింది. మరో 3,44,994 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. గత మూణ్నెళ్లలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవ్వడం ఇదే కావడం గమనార్హం. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఆయా రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక పోతున్నాయి.

ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 529,850 కేసులు వెలుగుచూశాయి. మరో 1,273 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 539,714,066కు చేరింది.

మరణాల సంఖ్య 6,329,704కు చేరింది. ఒక్కరోజే 455,312 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 512,293,947గా ఉంది. మరోవైపు అమెరికా వెళ్లే వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
Tags:    

Similar News