ఇన్ క్రెడిబుల్ మమత!

Update: 2022-03-30 05:43 GMT
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరి లోను అయోమయం పెంచేస్తున్నారు. అసలు ఆమె వ్యూహాలు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో అన్నీ పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని మొన్నటి 27వ తేదీన వివిధ పార్టీలకు లేఖలు రాశారు. లేఖలు అందుకున్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. మొదటిసారి మమత తరపున కాంగ్రెస్ కు లేఖ అందింది.

దీనికన్నా ముందు అంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగానే కాంగ్రెసేతర పార్టీలన్నీ బీజేపీ పై పోరాటానికి కలసి రావాలంటు పిలుపిచ్చారు. ఒక సారేమో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కాబట్టి ఆ పార్టీతో ఉపయోగం లేదంటారు. మరోసారేమో బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా మిగిలిన పార్టీలు ఏకమవ్వాలని పిలుపిస్తారు. తాజాగా బీజేపీపై పోరాటానికి అందరు ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ కు కూడా లేఖ రాశారు.

నిజంగా మమత లో చాలా మందికి ఓ అపరిచితురాలు కనబడుతున్నట్లే ఉంది. ఒక్కోసారి ఒక్కోలాగ వ్యవహరిస్తున్న మమతత తో పెట్టుకుంటే కష్టమే అని ఈపాటికే చాలా మందికి అర్ధమైపోయుంటుంది.

బీజేపీని అధికారంలో నుండి దింపేయాలన్న కోరిక మాత్రం మమతలో చాలా బలంగా ఉందన్నది వాస్తవం. పనిలో పనిగా కాంగ్రెస్ ను కూడా దూరం పెట్టేయాలని ఆలోచిస్తున్నారు. అయితే బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదని మిగిలిన పార్టీల్లో చాలా పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

సరిగ్గా ఈ విషయంలోనే మమతలో రెండు రకాల ఆలోచనలు కనబడుతున్నాయి. తనకేమో కాంగ్రెస్ ను కలుపుకోవాలని లేదు. కానీ కాంగ్రెస్ ను కలుపుకుని వెళ్ళందే బీజేపీపై పోరాటం సాధ్యం కాదు.  ఈ విషయంలోనే ఏమిచేయాలో మమతకు అర్ధం కావటంలేదు.

అందుకనే ఒక్కోసారి ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మిగిలిన పార్టీల్లో పూర్తి అయోమయం కనబడుతోంది.  మమతను నమ్ముకుని ఆమెతో చేతులు కలపాలా ? లేకపోతే ఆమెకు దూరంగా జరగాలా అనే విషయాన్ని మిగిలిన పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. ఇవన్నీ ఒకతాటి పైకి వచ్చేంత వరకు నరేంద్ర మోడీ ఫుల్లు హ్యాపీయే.
Tags:    

Similar News