కివీస్ సిరీస్ ను వదలని వరుణుడు.. రెండో వన్డే 29 ఓవర్లే

Update: 2022-11-27 06:32 GMT
టి20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ పరాజయం అనంతరం ఏ ముహూర్తా న్యూజిలాండ్ లో అడుగు పెట్టిందో కానీ.. వరుణుడు వదలకుండా వెంటాడుతున్నాడు. మూడు వన్డేలు, మూడు టి20 సిరీస్ కోసం న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న టీమిండియా వర్ధమాన ఆటగాళ్లకు అనుకున్నంత అనుభవం దక్కడం లేదు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో మూడు టి20ల సిరీస్ ఆడగా.. తొలి మ్యాచ్ వర్షంతో కొట్టుకుపోయింది. రెండో మ్యాచ్ లో మన జట్టు సాధికారికంగా ఆడి గెలిచింది. ఇక మూడో టి20లో రెండు జట్లకూ అవకాశాలు ఉండగా అనూహ్యంగా వర్షం కురిసింది. సరిగ్గా ‘టై’ అయ్యేందుకు సరిపోయిన పరుగులు చేసిన టీమిండియా పరాజయం నుంచి బయటపడింది. అలా టి20 సిరీస్ 1-0తో మన సొంతమైంది.

కచ్చితంగా గెలవాల్సిన రెండో వన్డేలో...

తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్లతో పరాజయం పాలైంది. బౌలింగ్ లో జూనియర్లను నమ్ముకుని బరిలో దిగిన మన జట్టుకు ఐదో బౌలింగ్ ప్రత్యామ్నాయం లేకపోవడం దెబ్బేసింది. దీంతో నేడు జరిగే మ్యాచ్ లో గెలవాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే సిరీస్ చేజారే ప్రమాదం పొంచి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం ఎదురైంది.

న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 4.5 ఓవర్ల దగ్గర వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 21 బాల్స్‌లో 19 పరుగుల వద్ద ఆడుతోండగా.. శిఖర్ ధావన్ 8 బాల్స్‌ను ఎదుర్కొని 2 పరుగులు చేశాడు. 4.5 ఓవర్లలో భారత్ 22/0 పరుగుల వద్ద కొనసాగుతోంది. టిమ్ సౌథీ 2.5ఓవర్లలో 11 పరుగులు ఇవ్వగా.. మాట్ హెన్రీ 2 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌కు దిగిన దగ్గర నుంచి శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడగా.. శిఖర్ ధావన్ కాస్త నెమ్మదిగా ఆడాడు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి 3 ఫోర్లతో 90.48 స్ట్రైక్ రేట్ వద్ద శుభ్‌మన్ గిల్ ఉండగా.. శిఖర్ ధావన్ కేవలం 25.00 స్ట్రైక్ రేట్‌ వద్ద ఉన్నాడు.

వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో కెప్టెన్ శిఖర్ ధావన్ డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. డ్రెసింగ్ రూమ్‌లో వీవీఎస్ లక్ష్మణ్, హృషికేశ్ కనిట్కర్‌‌తో మాట్లాడుతున్నాడు. మ్యాచ్ పరిస్థితులు, పిచ్ గురించి వారికి వివరించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యం అయింది. వర్షంతో గ్రౌండ్ తడిగా ఉండటంతో అంపైర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను స్టార్ట్ చేశారు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టు బాగా బలంగా ఉంది. వరుసగా 13 వన్డేలలో కివీస్ గెలుపొంది సూపర్ ఫామ్‌లో ఉంది.

అంత బలంగా ఉన్న జట్టును ఎదుర్కొని వన్డే సిరీస్‌ను కూడా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఈ కీలక మ్యాచ్ జరగాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వర్షం తగ్గిపోయి మ్యాచ్ తిరిగి ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నారు. స్వల్ప వర్షం కావడంతో తగ్గే అవకాశముందని గ్రౌండ్ స్టాఫ్ కూడా అంచనా వేస్తోంది. ఒకవేళ ఎంతసేపు అయినా వర్షం ఆగకపోతే మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాగా తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలవడంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆ జట్టు 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఈ రెండో మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఖచ్చితంగా గెలిస్తేనే సిరీస్ రేసులో భారత్ ఉంటుంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది.

మిగిలింది 24.1 ఓవర్లే

వర్షం పదేపదే అంతరాయం కలిగిస్తున్న రెండో వన్డేను కేవలం 29 ఓవర్లే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో భారత్ కు మిగిలిన ఓవర్లు 24.1 మాత్రమే. ఇందులోనే కనీసం 200 పరుగులు చేస్తే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. కాగా, టీమిండియా ఈ మ్యాచ్ కు రెండు మార్పులతో బరిలో దిగింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ను పక్కనపెట్టి ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ దీపక్ హుడాను తీసుకుంది. మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ ను తప్పించి పేస్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ కు అవకాశం ఇచ్చింది.
Tags:    

Similar News