చైనాకు చుక్కలు చూపించిన మనమ్మాయిలు

Update: 2022-02-01 16:30 GMT
మనమ్మాయిలు అదరగొట్టేశారు. ఆట ఏదైనా చెలరేగిపోయే చైనా జట్టుకు చుక్కలు చూపించారు. అంచనాలు అంతంత మాత్రంగా ఉన్న జట్టు.. అనూహ్యంగా అదరగొట్టేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నింటికి మించి.. చైనా జట్టుపై తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఒమన్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ హాకీ ప్రోలీగ్ లో భారత మహిళా హాకీ జట్టు అదరగొట్టే ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా జరిగిన తొలి మ్యాచ్ లో చైనాపై 7-1 గోల్స్ తేడాతో అదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన ఐదు మ్యాచుల్లో ఒక మ్యాచ్ లో అత్యధిక గోల్స్ సాధించిన జట్టుగా భారత్ నిలవటం మరో విశేషం. భారత్ - చైనా మధ్య జరిగిన మ్యాచ్ ను మినహాయించి చూస్తే.. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో అత్యధికంగా ఒక మ్యాచ్ లో నమోదైన గోల్స్ ఐదు మాత్రమే. అందుకు భిన్నంగా తమ తొలి మ్యాచ్ లోనే చైనా జట్టుపై ఆరు గోల్స్ ను నమోదు చేసిన భారతజట్టు అమ్మాయిలు తామేమిటో చాటారు. ఈ టోర్నీ విజేతగా నిలిచే సత్తా ఉందన్న సంకేతాల్ని పంపారు.

చైనాతో జరిగిన మొదటి మ్యాచ్ లో సాధించిన విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. వాస్తవంగా చూస్తే.. ఇప్పటివరకు అతి తక్కువ మ్యాచులు అడింది భారత్.. చైనానే. బెల్జియం జట్టు నాలుగు మ్యాచులు ఆడితే.. నెదర్లాండ్స్.. జర్మనీ జట్లు రెండేసి చొప్పున మ్యాచులు ఆడాయి. ఇప్పటివరకు సాధించిన అత్యధిక గోల్స్ కూడా భారత జట్టు ఖాతాలోనే ఉండటం విశేషం.

భారత జట్టు అమ్మాయిలు సాధించిన ఆరు గోల్స్ లో.. సుశీల చాను రెండు..  నవనీత్ కౌర్.. నేహా.. వందనా కటారియా.. షర్మిలా దేవీ.. గుర్జీత్ కౌర్ లో ఒక్కొక్కటి చొప్పున గోల్స్ ను చేశారు. చైనా జట్టులో జు డెంగ్ మ్యాచ్ మొదలైన 43 నిమిషంలో తన మొదటి గోల్ ను సాధించింది. మ్యాచ్ మొత్తాన్ని చూసినప్పుడు.. భారత అమ్మాయిలు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించి.. మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో శాసించారని చెప్పాలి. ఈ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని.. టోర్నీని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.


Tags:    

Similar News