తాళం ఇచ్చి..కీ ఇప్పుడే వద్దంటున్న ‘‘జీ4’’

Update: 2017-03-09 06:17 GMT
ఐక్యరాజ్య సమితి యవ్వారం మహా ఆసక్తిగా ఉంటుంది. ఈ సమితి పగ్గాలు మొత్తం ఐదు దేశాల పరిధిలోనే ఉంటాయన్న విషయం తెలిసిందే. వారేం చెబితే అందుకు తగ్గట్లుగా ప్రపంచంలోని ఏ దేశమైనా నడుచుకోవాల్సి ఉంటుంది. మరింత విచిత్రమేమిటంటే.. ప్రపంచ జనాభాలో కీలక భూమిక పోషించే దేశాలకు ఐక్యరాజ్యసమితిలో కీలకమైన భద్రతా మండలిలో ప్రాతినిధ్యం లభించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఇప్పటివరకూ తన తీరును మార్చుకున్నది లేదు. భద్రతా మండలి మొత్తం ఐదు దేశాల (అమెరికా - బ్రిటన్ - ఫ్రాన్స్ - రష్యా - చైనా) అధీనంలో ఉంటుందన్నది తెలిసిందే. ఈ ఐదు దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంటుంది. అప్పుడెప్పుడో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన  సమితిలో ఇప్పటివరకూ మరే దేశానికి ఇందులో చోటు కల్పించటానికి ఇష్టపడని పరిస్థితి.

జనాభా పరంలో ప్రపంచంలో చైనా తర్వాత స్థానం భారత్ దే అయినప్పటికీ భద్రతామండలిలో మాత్రం దేశానికి స్థానం దక్కని పరిస్థితి. ఏ దేశం మీదా అనవసరంగా కాలుదువ్వకుండా తన మానాన తాను బతికే భారత్ కు భద్రతామండలిలో చోటు ఇవ్వాలన్న అంశంపై పెద్దఎత్తున చర్చ సాగుతున్నా.. పొరుగున ఉన్న చైనా పడనివ్వని పరిస్థితి.

ఇదే తీరులో మరిన్ని దేశాల అభ్యర్థనను ఏదో ఒక సాకు చూపించి భద్రతామండలిలో స్థానం కల్పించకుండా మోకాలడ్డేస్తున్నారు. ఇలాంటి వేళ.. భద్రతామండలిలో శాశ్విత సభ్యత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బ్రెజిల్.. భారత్.. జర్మనీ.. జపాన్ దేశాలు (జీ 4) వినూత్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చాయి. తమకు భద్రతామండలిలో శాశ్విత దేశాల హోదా ఇస్తే సరిపోతుందని.. తమకు వీటో అధికారం ఇవ్వొచ్చా? లేదా? అన్న అంశంపై తగు నిర్ణయం తీసుకునే వరకూ వెయిట్ చేస్తామన్న ప్రతిపాదనను తీసుకొచ్చారు.

జీ4 దేశాల ప్రతిపాదన చూసినప్పుడు కీ లేకున్నా ఫర్లేదు.. తాళం ఇవ్వండి మహా ప్రభో అన్నట్లుగా ఉందని చెప్పాలి. తాళం చెవి లేని తాళం కప్పతో జీ4 దేశాలు ఏం చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదోలా భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న జ4 దేశాల తాజా ప్రతిపాదనకు భద్రతామండలిలోని ఐదు శాశ్విత సభ్యత్వం ఉన్న దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News