ఒకే మ్యాచ్‌ కు పాక్ ప్ర‌ధాని..దావూద్ ఇబ్ర‌హీం

Update: 2018-09-18 17:05 GMT
ఆసియా కప్‌ లో భాగంగా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఈ మ్యాచ్ మ‌రిన్ని హాట్ అప్‌ డేట్స్‌ తో తెర‌మీద‌కు వ‌స్తోంది. దుబాయి వేదికగా బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవనున్న ఈ మ్యాచ్‌ కు పాక్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ హాజరు కానున్నారు. ఈ క్రేజ్‌ కు కొన‌సాగింపుగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు వస్తున్నట్లు ప్రముఖ ఇంగ్లీషు మీడియా కథనాన్ని ప్రచురించింది. దీంతో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరిగింది.

మ‌రోవైపు పాక్‌-ఇండియా మ్యాచ్‌ ను ప్రత్యక్షంగా చూడటానికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు - అతని కుటుంబ సభ్యులు వస్తున్నట్లు ఆరు ఏజెన్సీలు వెల్లడించడం గమనార్హం. ఇండోపాక్ మ్యాచ్ గురించి ఓ కీలక సమాచారం ఇంటెలిజెన్స్ గ్లోబల్ నెట్‌ వర్క్‌ కు అందింది. దావూద్ సన్నిహితులైన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌ స్టర్లు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్నారని వాళ్లకు సమాచారం తెలిసింది. అంతేకాదు దావూద్ కుటుంబ సభ్యులు - బంధువులు ఇప్పటికే ముంబై - కరాచీల నుంచి మ్యాచ్ చూడటానికి దుబాయ్‌కు వచ్చారు. ఈ సమాచారం వచ్చిన తర్వాత ఆరు దేశాలకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ ను పట్టుకోవడంతోపాటు పాకిస్థాన్‌ లో దావూద్ ఉన్న ప్రదేశం - అతనికి చెందిన కొత్త వ్యాపారాల గురించి తెలుసుకోవడానికి ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఇండియాతోపాటు అమెరికా - యూకే - రష్యా - చైనాలకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ మ్యాచ్‌ ను నిశితంగా పరిశీలించనున్నాయి. ఈ మ్యాచ్ కోసం టికెట్ల రేట్లను కూడా భారీగా పెంచారు. మైదానంలో ఉండే ప్రత్యేక అతిథుల గ్యాలరీలో ఒక్క టికెట్ ధరను సుమారు రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు. ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్‌ లంటే దావూద్‌ కు చాలా ఇష్టం. అతడు ఈ మ్యాచ్‌ లను మిస్ అవకుండా చూడటంతోపాటు.. భారీగా బెట్టింగ్‌ లకు కూడా పాల్పడతాడు. ఏషియాకప్‌ లో భాగంగా మంగళవారం హాంకాంగ్‌ తో తలపడనున్న భారత్.. బుధవారం దాయాది పాకిస్థాన్‌ తో హైవోల్టేజ్ మ్యాచ్‌ లో ఆడనుంది.

ఆసియా కప్‌ లో చిరకాల ప్రత్యర్ధులు తలపడనున్న నేపథ్యంలో మ్యాచ్ సూసేందుకు ఇమ్రాన్‌ దుబాయి వెళ్లనున్నారని సమాచారం. ఇమ్రాన్‌ ఖాన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రెండు రోజులు పర్యటన కోసం మంగళవారం సౌదీ అరేబియాకు వెళ్ల‌గా ఈ మ్యాచ్ ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని స‌మాచారం. కాగా, 2017 ఛాంపియన్ ట్రోఫీ అనంతరం భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో పాక్ 180 పరుగులతో భారత్ పై గెలిచి కప్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత రెండు దాయాది దేశాల మధ్య మ్యాచ్ కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది.


Tags:    

Similar News