మూడో ఆర్థిక శక్తిగా భారత్.. ఐదేళ్లలో సాధ్యమన్న ఐఎంఎఫ్

Update: 2022-10-17 16:00 GMT
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా,  ఆ తర్వాత చైనాలు ఇప్పుడు ప్రపంచ తొలి ఆర్థిక శక్తులుగా ఉన్నాయి. ఇప్పుడు మూడోస్థానంలోకి రావడానికి భారత్ కు మరో ఐదేళ్ల సమయం పడుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది.  అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ డేటాబేస్ ప్రకారం, 2028 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశం.. ప్రస్తుతం 3వ, 4వ స్థానాల్లో ఉన్న జర్మనీ మరియు జపాన్‌లను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చు అని అంచనావేసింది. మొదటి రెండు ఆర్థిక వ్యవస్థలుగా అమెరికా, చైనాలు కొనసాగుతాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

భారతదేశం వేగవంతమైన పురోగతికి కారణాలు కూడా ఐఎంఎఫ్ తెలిపింది. వేగంతో ఆశించిన ఆర్థిక విస్తరణ జరుగుతోందని.. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చాలా కరెన్సీల కంటే తక్కువగా క్షీణించడం ఇందుకు దోహదపడుతుందని తెలిపింది.

మార్కెట్ మారకపు ధరలలో భారతదేశం ఇప్పటికే బ్రిటన్ దేశాన్ని అధిగమించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఐఎంఎఫ్ తెలిపింది. కొన్ని రోజుల తర్వాత క్యాపిటల్ ఎకనామిక్స్ మరొక నివేదిక వెలువడింది. 2030 నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని, అమెరికా -చైనాలను వెనక్కు నెట్టి, వచ్చే దశాబ్దంలో ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో సగానికి పైగా వాటాను కలిగి ఉన్న అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అగ్రగామిగా నిలుస్తుందని నివేదిక అంచనా వేసింది.

కరోనా మహమ్మారి యుద్ధం-ప్రేరేపిత ద్రవ్యోల్బణం కారణంగా చాలా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అవి స్వల్పంగా పెరుగుతాయని.. లేదంటే మాంద్యంలోకి వెళ్తాయని నివేదిక తెిపింది.

కానీ భారతదేశం వృద్ధి సాధిస్తోందని ఈ మాంద్యాన్ని తట్టుకొని నిలబడిందని కొనియాడారు. భారత్ వృద్ధి పుంజుకుంటోందని.. ఆర్థిక వ్యవస్థ మంచి వేగంతో విస్తరిస్తుందని అంచనావేసింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చాలా కరెన్సీల కంటే తక్కువగా పడిపోయిందని నివేదిక పేర్కొంది.

భారతదేశం మంచి స్థూల ప్రాథమికాలను కలిగి ఉంది. ద్రవ్యోల్బణం నిలకడగానే ఉంది.  కరెంట్ ఖాతా లోటు ఎక్కువగా ఉంది కానీ మోడరేట్‌గా ఉంటుందని అంచనా వేసింది. ఫారెక్స్ నిల్వలు తగ్గినప్పటికీ దాదాపు $550 బిలియన్లు భారత్  వద్ద ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సౌకర్యవంతంగా ఉంది. బ్యాంకులు బలమైన స్థితిలో ఉన్నాయి.  క్రెడిట్ చక్రం పుంజుకుంటోందని నివేదిక తెలిపింది..

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డేటా ప్రకారం భారతదేశం జీడీపీ ప్రతి వ్యక్తికి $2,520 అమెరికన్ డాలర్లుగా ఉంది. 2027 నాటికి ఈ మొత్తం 3652 డాలర్లకు చేరుతుంది. జర్మనీ, జపాన్ దేశాలను అధిగమించడానికి భారత్ కు ఇదే సువర్ణావకాశం అని.. జర్మనీ, జపాన్ లు ద్రవ్యోల్బణం, మాంద్యం ప్రభావంతో భారత్ దూసుకుపోవడం ఖాయమని అంచనావేసింది. ప్రస్తుతం 2022 సంవత్సరంలో భారత్ ఏకంగా 8.7 శాతం వృద్ధి సాధించి ప్రపంచంలోని  టాప్ దేశాల కంటే ఎక్కువ వృద్ధితో దూసుకెళుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News