ఉత్తర కొరియాకు భారత్ ట్రైనింగ్?

Update: 2016-06-23 10:46 GMT
ఉత్తర కొరియా.. ఈ పేరు చెబితే అమెరికా ఉలిక్కి పడుతుంది. ఉత్తరకొరియా అన్న పేరు పలికే దేశాలపై కన్నేసి ఉంచుతుంది. ఉత్తర కొరియా ఒక్క అమెరికాకే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు బూచి.  ఎవరినీ లెక్కచేయని ఆ దేశాధినేత అంటే అగ్రరాజ్యాలకు ఆగ్రహం - వణుకు. అలాంటి ఉత్తరకొరియాకు భారత్ పాఠాలు చెబుతోందట. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే ఇటు ఉత్తర కొరియాకు రహస్యంగా సాంకేతిక పాఠాలు నేర్పిస్తోందంటూ భారత్ పై అల్ జజీరా ప్రసారం చేసిన కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది.

ఇండియాలో ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే డెహ్రాడూన్ లోనే ఓ శిక్షణా కేంద్రంలో ఉత్తర కొరియా విద్యార్థులు హైటెక్ స్పేస్ టెక్నాలజీలపై పాఠాలు నేర్చుకుంటున్నారని అల్ జజీరా వెల్లడించింది.  గతంలో ఇండియాలో పనిచేసిన నార్త్ కొరియా దౌత్యాధికారి హాంగ్ యాంగ్ ఇల్ ఈ విషయాన్ని వెల్లడించారని, చాలా ప్రశాంతంగా ఉండే డెహ్రాడూన్ లో ఎవరికీ అనుమానం కలగని రీతిలో ఈ టెక్నాలజీ బోధన సాగుతోందని అంటున్నారు. కాగా 1995లో ఐక్యరాజస్యసమితి ఈ కేంద్రాన్ని ప్రారంభించింది.  ఇందులో ఇప్పటివరకూ 30 మంది ఉత్తర కొరియా విద్యార్ధులు పంపిందని, ఇప్పటికీ ఇద్దరు ఇండియాలో ఉన్నారని ఆ కథనం చెబుతోంది.

కాగా అణు ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియాకు సహకరిస్తుండటంపై ఐక్యరాజ్యసమితి భారత్ ను ప్రశ్నించిందని... దీంతో ఐరాస సలహా సంఘానికి ఇండియా వివరణ ఇచ్చుకుందని కూడా చెబుతున్నారు.  అయితే... ఈ కథనంపై ఇండియా సీరియస్ అవుతోంది. 'ఇండియాస్ ఎంబ్రాసింగ్ నార్త్ కొరియన్ కనెక్షన్' పేరిట అల్ జజీరా ప్రసారం చేసిన కథనాన్ని కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.  ఉత్తర కొరియా విద్యార్థులెవరూ రహస్యంగా ఇక్కడ విద్యాభ్యాసం చేయడం లేదని స్పష్టం చేసింది. మొత్తానికి ఇదేదో పెద్ద దుమారమే రేపేలా కనిపిస్తోంది.
Tags:    

Similar News