భారత్ - ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ లో మీరెప్పుడూ చూడని రేర్ సీన్

Update: 2021-08-05 04:30 GMT
టీమిండియా - ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. టెస్టు మ్యాచ్ వార్త అన్నంతనే.. స్కోర్ బోర్డు.. ఆటలో ఎవరు రాణించారు? ఎవరు ఇరగదీశారు? ఎవరు ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచారు? లాంటి అంశాలు ఉంటాయనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్పే విషయం.. ఇలాంటివి చాలా చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఇప్పుడీ వార్త గ్రౌండ్ లో జరిగిన ఉదంతం కాదు.. గ్రౌండ్ లో కాదు స్టాండ్స్ లో జరిగింది.

అనూహ్యంగా బయటకు వచ్చిన ఈ వైనం గురించి విన్న వారి మనసంతా భారమవుతుందని చెబుతున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కు భారీ షాక్ తగిలింది. చెలరేగిపోయి బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు షమీ.. బుమ్రా దెబ్బకు కేవలం 183 పరుగులకే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. ఆటను పక్కన పెడితే.. మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఉదంతం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.

మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియం వైపు కెమేరాలు తిరగటం.. ఆటను తిలకించే ప్రేక్షకుల్ని చూపించటం మామూలే. అలా జరుగుతున్న వేళ.. స్టాండ్ లో ఒక మిత్ర బృందం జోష్ గా కనిపించింది. వారి మధ్యలో ఒక సీటు మాత్రం ఖాళీగా ఉంది. దీని గురించి ఆరా తీసిన వారికి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. విన్నంతనే భావోద్వేగానికి గురయ్యేలా ఈ ఉదంతం ఉండటం గమనార్హం.

జాన్ క్లార్క్ అనే వ్యక్తి తాజాగా మ్యాచ్ జరుగుతున్న ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో జరిగే ప్రతి మ్యాచ్ కు హాజరయ్యేవాడు. గడిచిన నలభై ఏళ్లలో అతను ఒక్కసారి కూడా మ్యాచ్ మిస్ కాలేదు. తాజాగా టీమిండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు జాన్ క్లార్క్ రాలేదు. కారణం.. అతను ఈ మధ్యనే మరణించారు. ట్రెంట్ బిడ్జ్ మైదానంతో జాన్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అతడి స్నేహితులు.. అతని కోసం అనూహ్యమైన పని చేశారు. తమతో పాటు జాన్ కు టికెట్ కొన్నారు. ఆ సీటును ఖాళీగా ఉంచి.. అతన్ని స్మరించుకోవటమే కాదు.. గౌరవించుకున్నారు.

ఇలా తమ స్నేహితుడి కోసం చేసిన పని వైరల్ గా మారటమే కాదు.. ఈ స్నేహ బృందాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇలాంటివి చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయని చెప్పక తప్పదు. ఈ విషయం గురించి తెలిసిన వారంతా ఎమోషనల్ అవుతున్నారు. స్నేహితుడి కోసం ఆ మిత్రుల బృందం ఎంత గొప్పగా ఆలోచించిందో కదూ?
Tags:    

Similar News