ఊళ్లకు వెళ్లొచ్చన్న మాట చెప్పారంటే.. జరిగేది అదేనా?

Update: 2020-04-30 04:45 GMT
కారణం ఏదైనా కానీ.. ఊరికి వెళ్లలేని పరిస్థితి కొత్త కాకున్నా.. ఒకరోజో.. రెండు రోజులో. లేదంటే వారం రోజులు. అంతేకానీ వారాలకు వారాల పాటు ఊరికి వెళ్లకుండా ఉండిపోవటమే కాదు.. ఎప్పటికి వెళతామో కనీస అవగాహన లేని పరిస్థితి ఇప్పటివరకూ ఎవరికి అనుభవంలో లేనిది. అలాంటి దారుణ పరిస్థితి కరోనా పుణ్యమా అని ఎందరికో ఎదురైంది. వలసకూలీ మొదలు.. చుట్టపు చూపుగా ఊరు కాని ఊరికి వచ్చినోళ్లు ఇరుక్కుపోయిన దుస్థితి. దేశ వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది వేరే ఊళ్లల్లో ఇరుక్కుపోయారు. తొలుత అమల్లోకి తెచ్చిన 21 రోజులకు ఓకే అన్నా.. తర్వాత దాన్ని మరో మూడు వారాలకు పొడిగించినా ఏమా మాట్లాడలేని పరిస్థితి.

అత్యవసర పరిస్థితులు ఎదురైనోళ్లు.. సొంత వాహనాలత్లో పోలీసుల పర్మిషన్లతో తమ ఊళ్లకు వెళ్లే అవకాశం లభించగా.. కూలీపనులు చేసుకునేవారు.. పరిమితమైన వనరులు ఉన్న వారు.. ఇతర అంశాలతో ఊళ్లకు వెళ్లిన వారు మాత్రం ఊళ్లకు వెళ్లలేక ఇరుక్కు పోయారు. ఇలాంటి వారందరికి ఊరట కల్పిస్తూ బుధవారం సాయంత్రం కేంద్రం తీపి కబురు చెప్పింది. లాక్ డౌన్ కారణంగా వేరే ఊళ్లల్లో నిలిచి పోయిన వారంతా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ అనుమతిని ఇచ్చింది.

ప్రజారవాణా పూర్తిగా స్తంభించిపోయిన నేపథ్యంలో వారిని వారి.. వారి స్వస్థలాలకుతరలించేందుకు వీలుగా కేంద్ర సర్కారు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతుల్ని జారీ చేసింది. అయితే.. అదెలా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఒకట్రెండురోజుల్లో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన విధివిధానాల్ని సిద్ధం చేస్తుందని చెబుతున్నారు.

ఇంతకూ లాక్ డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారంతా వారి స్వస్థలాలకు తరలి వెళ్లేందుకు వీలుగా కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ 2.0కు పొడిగింపుగా 3.0 ఉండే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే నెలన్నరగా తమది కాని ఊళ్లల్లో ఉండిపోయిన వారు.. మరిన్ని రోజులు ఉండి పోవటం కష్టంగా మారుతుంది. అందుకే.. లాక్ డౌన్ కారణంగా చిక్కుకు పోయిన వారిని వారి స్వస్థలాలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిలో కొందరు మొండిగా కాలిబాటన తమ ప్రాంతాలకు పయనం కావటం తెలిసిందే. మొదట్లో ఇలాంటివారిని పోలీసులు అడ్డుకునేవారు. తర్వాతి కాలంలో అలాంటి వారిని అడ్డుకోకుండా చూసిచూడనట్లుగా వదిలేశారు. దీంతో.. ఇప్పటికే వేలాది మంది తమ స్వస్థలాలకు నడకబాటన వెళ్లటం తెలిసిందే. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం చూస్తే.. లాక్ డౌన్ పొడిగింపు మరిన్ని రోజులు కొనసాగే వీలుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News