భార‌తీయుల్లో ఆ అల‌వాటు ఎక్కువ‌న్న వాట్సాప్‌

Update: 2017-05-09 05:28 GMT
సాంకేతిక‌త ఎంత అందుబాటులోకి వ‌చ్చినా.. కొన్నింటితో మ‌నిషి జీవితం మొత్తం మారిపోతుంది. అలా స‌గ‌టు జీవిపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించ‌ట‌మే కాదు.. అది లేని జీవితాన్ని ఊహించుకోవ‌టం క‌ష్టంగా మార్చింది వాట్సాప్‌. గ‌డిచిన ప‌దేళ్ల‌లో సోష‌ల్ మీడియాలో చాలానే మార్పులు చోటు చేసుకున్న‌ప్ప‌టికీ.. స‌గ‌టు జీవి జీవితంలో ఒక దిన‌చ‌ర్య‌గా మారిపోయింది మాత్రం వాట్సాప్ మాత్ర‌మే.

వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్ర‌తిఒక్క‌రూ నిత్యం వినియోగించే వాట్సాప్ కున్న మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. వాట్సాప్ తో నిత్యం గంట‌ల కొద్దీ స‌మ‌యం వృధా అవుతున్నా.. దాన్ని చూడ‌టంతో టైం వేస్ట్ అన్న భావ‌న క‌ల‌గ‌నీయ‌కుండా చేయ‌టం వాట్సాప్ మేజిక్‌. మిగిలిన సోష‌ల్ గ‌మీడియాను నిత్యం అదే ప‌నిగా చూడ‌టం జ‌బ్బుగా అభివ‌ర్ణించే వారు సైతం.. వాట్సాప్ మీద ఆ ముద్ర వేయ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌ట‌మే కాదు.. వ్యాపారానికి.. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు ఇందులో ఉన్న ఫీచ‌ర్లే దీనికి కార‌ణంగా చెప్పొచ్చు.
అదే స‌మ‌యంలో వాట్సాప్ ను సైతం అభినందించాల్సింది. మొద‌ల‌పెట్టిన చోట‌నే ఆగిపోకుండా నిత్యం కొత్త‌గా.. స‌రికొత్త‌గా ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తూ.. మ‌రింత ఎంగేజ్ చేయ‌టం దానికే సాధ్యం.

ఇటీవ‌ల వాట్సాప్ వీడియోకాలింగ్ ఆప్ష‌న్‌ను ఇవ్వ‌టం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ఫీచ‌ర్ వినియోగిస్తున్న వైనంపై వాట్సాప్ ఒక విశ్లేష‌ణ చేసింది. గ‌డిచిన ఆర్నెల్ల‌లో ఈ ఫీచ‌ర్ ను ఉప‌యోగిస్తున్న దేశాల్లో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉన్న‌ట్లుగా పేర్కొంది. భార‌త్ నుంచి నిత్యం ఐదుకోట్ల వీడియో కాలింగ్ నిమిషాలు న‌మోద‌వుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. వాట్సాప్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 100.20 కోట్ల మంది నెల‌స‌రి యాక్టివ్ యూజ‌ర్లు ఉండ‌గా.. వీరిలో 20 కోట్ల మంది ఏకంగా భార‌త్ నుంచే కావ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌పంచ వ్యాప్తంగా రోజూ 34 కోట్ల వీడియో కాలింగ్ నిమిషాలు న‌మోద‌వుతుండ‌గా.. భార‌త్ నుంచే 5 కోట్ల వీడియో కాలింగ్ నిమిషాలు న‌మోద‌వుతున్న‌ట్లుగా వెల్ల‌డించింది. నిజానికి వీడియో కాలింగ్ ఫీచ‌ర్ ఇత‌ర సంస్థ‌లు అవ‌కాశం ఇచ్చిన‌ప్ప‌టికీ.. వాట్సాప్ కాస్త ఆల‌స్యంగా ప్ర‌వేశ పెట్టిన‌ట్లుగా చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. ఇంత భారీగా ఆద‌రించ‌టం విశేషం. మిగిలిన దేశాల‌తో పోలిస్తే.. భార‌తీయుల్లో వీడియోకాలింగ్ ఫీచ‌ర్ ను ఎక్కువ‌గా వినియోగిస్తున్న‌ట్లుగా వాట్సాప్ చెప్ప‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News