భారత్ మీ రాక కోసం వేచి చూస్తోంది : క‌మ‌లాహారీస్‌ తో మోదీ

Update: 2021-09-24 08:30 GMT
అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదట అమెరికాలోని టాప్‌ గ్లోబల్‌ కంపెనీల సీఈఓలతో సమావేశమైన నరేంద్ర మోడీ ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశంలో కరోనా రెండో దశ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ గెలవడం చారిత్రాత్మకమని మోదీ అన్నారు. బైడెన్‌, కమలా హారిస్‌ నేతృత్వంలో అమెరికా, భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా మెరుగవుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ కమలా హారిస్‌ను భారత పర్యటనకు ఆహ్వానించారు. ఇక కమలా హారిస్‌ మాట్లాడుతూ.. అమెరికాకు భారత్‌ ప్రత్యేక భాగస్వామి అని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో ఎన్నో దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ అందించిందన్నారు. ఇక భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి చెందినప్పుడు అమెరికా తన బాధ్యతగా సహకారం ఇచ్చిందని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలోనూ సాయం చేసిందన్నారు.భారత్‌లో ప్రస్తుతం రోజుకు కోటీ టీకాలు వేస్తున్నారని తెలుస్తోందని కమలా అన్నారు. త్వరలోనే భారత్‌ వ్యాక్సిన్‌ ఎగుమతులను తిరిగి ప్రారంభిస్తుందని మోడీ తెలిపినట్లు కమలా హారిస్‌ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయని.. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కమలా హారిస్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ నెల 24న మోదీ, జోబైడెన్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని వైట్‌ హౌస్‌ వర్గాలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక మోదీతో జరిగే తొలి భేటీ ఇదే కావడం విశేషం. దీంతో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు యూఎస్‌ ప్రెసిడెంట్‌ కార్యక్రమాల షెడ్యూల్‌లో మోదీతో సమావేశాన్ని ఖరారు చేశారు. 2019లో చివరిసారి మోదీ అమెరికాలో పర్యటించారు. కరోనా అనంతరం మోదీ జరపబోయే రెండో విదేశీ పర్యటన ఇదే, మార్చిలో ఆయన బంగ్లాదేశ్‌ ను సందర్శించారు. మోదీతో సమావేశానంతరం జపాన్‌ ప్రధాని సుగాతో బైడెన్‌ భేటీ అవుతారని అధికారులు చెప్పారు.

అక్టోబర్‌ 24న తొలిసారి క్వాడ్‌ దేశాల అధినేతల సమావేశం వైట్‌హౌస్‌లో జరగనుంది. ఇందులో బైడెన్, మోదీ, సుగా, స్కాట్‌మారిసన్‌ పాల్గొంటారు. ఈఏడాది జరిపిన క్వాడ్‌ వీడియో సమావేశం అనంతరం జరిగిన పురోగతిని రాబోయే సమావేశంలో సమీక్షిస్తారు. క్వాడ్‌ దేశాల వ్యాక్సిన్‌ కార్యక్రమంపై కూడా చర్చలుంటాయని విదేశాంగ శాఖ తెలిపింది. అన్నింటికన్నా ముఖ్యంగా తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, నూతన టెక్నాలజీ వినియోగం, వాతావరణ మార్పు తదితర కీలక అంశాలను కూడా సమావేశంలో ప్రస్తావిస్తారని తెలిపింది.


Tags:    

Similar News