భార‌త్ లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు!

Update: 2018-06-26 11:04 GMT
భార‌త దేశంలో కొంత‌కాలగా మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు - అత్యాచారాలు - హ‌త్యలు...పెరిగిపోతోన్న సంగ‌తి తెలిసిందే. ప‌సిపిల్ల‌లు మొద‌లుకొని పండు ముస‌లివారి వ‌ర‌కూ కామాంధుల చేతిలో బ‌లైన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం జ‌రిగిన `నిర్భ‌య` అత్యాచార ఘ‌ట‌న దేశవ్యాప్తంగా పెను ప్ర‌కంప‌న‌లు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు `నిర్భ‌య‌` చ‌ట్టాన్ని అమ‌లులోకి తెచ్చినా పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింది. తాజాగా, క‌థువాలో జ‌రిగిన చిన్నారి ఆసిఫా ఘ‌ట‌న .....దేశంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని మరోసారి నిరూపించింది. క‌ఠిన చ‌ట్టాలు చేసినా....శిక్ష‌లు విధిస్తున్నా....కామాంధుల బుద్ధి మార‌క‌పోవ‌డంతో అమాయ‌క అబ‌ల‌లు బ‌ల‌వుతూనే ఉన్నారు. ఈ అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు తోడుగా చాలామంది మ‌హిళ‌లు నిత్యం లైంగిక వేధింపులకు గుర‌వుతుండ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల‌లో మేనేజ‌ర్ స్థాయి నుంచి ......ఇళ్ల‌లో ప‌నిచేసే ప‌నిమ‌నుషుల వ‌ర‌కు....ఈ లైంగిక వేధింపులకు గురైన‌వారి జాబితాలో ఉండ‌డం శోచ‌నీయం. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచంలోని ప‌లుదేశాల్లో మహిళ‌ల ర‌క్ష‌ణ‌పై రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్ల‌డ‌య్యాయి. ఆ ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో మ‌హిళ‌ల‌కు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన దేశాల జాబితాలో భార‌త్ అగ్ర‌స్థానంలో నిలిచింది.

భార‌త్ లో ప‌సిపిల్ల‌ల‌తో స‌హా మహిళలకు ఏమాత్రం ర‌క్ష‌ణ లేద‌ని రాయిట‌ర్స్ స‌ర్వేలో తేలింది. ప‌ట్టుమ‌ని ప‌దినెల‌లు నిండ‌ని ప‌సిపిల్ల మొద‌లు....పండు ముస‌లి వ‌ర‌కు చాలామంది లైంగిక వేధింపులు, అత్యాచారాల‌కు గుర‌వుతున్నార‌ని ఆ స‌ర్వేలో వెల్ల‌డైంది. అంతేకాకుండా,  మహిళలపై లైంగిక హింసతోపాటు వారిని బానిస కార్మికులుగా మారుస్తున్నార‌ని ఆ సంస్థ తెలిపింది. మహిళల అంశాలకు సంబంధించి నిపుణులైన 550 మంది అభిప్రాయాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ స‌ర్వే నిర్వ‌హించారు. మహిళలకు అత్యంత‌ ప్రమాదకర దేశాల జాబితాలో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా..... అఫ్ఘానిస్తాన్ - సిరియా రెండు - మూడో స్థానాల్లో ఉన్నాయి. సోమాలియా - సౌదీ అరేబియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, అగ్ర‌రాజ్యం అమెరికా ఈ జాబితాలో సిరియాతో పాటు మూడో స్థానంలో ఉండ‌డం విశేషం. నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగి ఐదేళ్ల‌యినా కూడా మహిళల భద్రతకు ప్రభుత్వం స‌రైన చర్యలు తీసుకోలేని సర్వేలో తేలింది. అత్యాచారం - వైవాహిక అత్యాచారం - లైంగిక దాడి - హింస - శిశువుల హత్య.....వంటి ఎన్నో ఘెరాలు భార‌త్ లో నిత్య కృత్య‌మ‌య్యాయ‌ని ఆ స‌ర్వేలో తేల‌డం శోచ‌నీయం.

Tags:    

Similar News