మ‌రో వివాదంలో మోడీ

Update: 2015-11-06 16:57 GMT
దేశంలో స్వేచ్ఛ‌ను హ‌రిస్తున్నార‌ని, అస‌హ‌నం పెరిగిపోతోంద‌ని...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఇందుకు కారణ‌మ‌ని పేర్కొంటూ ప‌లువురు ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో తాజాగా ఇదే కేట‌గిరీకి చెందిన మ‌రో వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని, సహజ వనరులను విస్తృతంగా వినియోగించడాన్ని నిరోధించాలని కోరుతూ ప్రచారం చేస్తున్న‌ గ్రీన్ పీస్ ఇండియా గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రీన్ పీస్ ఇండియా తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ చట్టం ప్రకారం స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌(ఎన్జీవో)గా గుర్తింపు పొందింది. దీనిని రద్దు చేస్తూ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఐక్య‌రాజ్య స‌మితి స‌హా జనరల్ సెక్రటరీతోపాటు పలువురు అంతర్జాతీయ నేతలు స్వచ్చంద సంస్థల ప్రాధాన్యతను గుర్తిస్తుంటే ఇపుడు ఎన్జీవో గుర్తింపును రద్దు చేయడం సరికాదని గ్రీన్ పీస్ పేర్కొంది. ఇది వాక్ స్వాతంత్రంపై వేటు వేయడమేనని వ్యాఖ్యానించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తున్న రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ  త‌మ సంస్థ‌పై వేటు వేయాల‌ని ఏడాదిగా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని మండిప‌డింది. త‌మ‌కు న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంద‌ని పేర్కొంది. రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దుచేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్టు సమాచారం.
Tags:    

Similar News