ఆ మ్యాచ్ అంతమంది చూశారా?

Update: 2021-11-26 16:30 GMT
దాయాది జట్లు.. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే.. అభిమానుల్లో ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. మైదానంలో మ్యాచ్ జరుగుతుంటే.. మన మనసులో యుద్ధం మొదలవుతుంది. పరుగులు పారుతుంటే.. మన గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. వికెట్లు పడుతుంటే మన చెమటలు పడుతుంటాయి.. అంతిమంగా మన జట్టుదే గెలుపు కావాలన్న పట్టుదల పెరుగుతుంది. ఇదంతా దశాబ్దాలుగా మనం చూస్తున్నదే.. ఇందుకు తగ్గట్లే టీవీలకు జనం అతుక్కుపోతుంటారు. టీఆర్పీ లు పెరిగిపోతుంటాయి.

రికార్డులు నెలకొల్పిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్

గత నెల చివరలో యూఏఈలో జరిగిన భారత్ పాక్ మ్యాచ్ టీవీ వీక్షణల పరంగా అనేక మైలురాళ్లు చేరుకుంది. ఈ మ్యాచ్ తో్నే టీమిండియా ప్రపంచ కప్ లో ప్రయాణం ప్రారంభించింది. అయితే, అనూహ్యంగా కోహ్లి జట్టు పరాజయాన్ని మూటగట్టుకుంది.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయాల్సి రావడం.. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేకపోవడంతో టీమిండియా మంచి స్కోరు సాధించలేకపోయింది. పరుగులు చేయడంలో మన బ్యాట్స్ మన్ వెనుకబడిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆదిలోనే వెనుదిరగడం దెబ్బకొట్టింది.

కెప్టెన్ కోహ్లి నిలబడినా.. జట్టుకు మరింత పెద్ద స్కోరు అందించలేకపోయారు. ఛేదనలో పాకిస్థాన్ ఒక్క వికెట్టూ కోల్పోకుండా పరుగులు చేసింది. మన జట్టు ఓడినా అత్యధిక శాతం అభిమానులు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు.

ఇదంతా అలా ఉంటే.. నాటి మ్యాచ్ ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారని ఐసీసీ ప్రకటించింది. మన జట్టు ఓడిపోయినా.. ఇండియాలోనే ఈ మ్యాచ్ ను అత్యధికంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు అభిమానులు తిలకించారు.

ఇన్ని రోజులు ఈ అత్యధిక విక్షణ రికార్డు 2016 టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ – వెస్టిండీస్ తలపడిన మ్యాచ్ పేరిట ఉండేది. కానీ ఇప్పుడు ఇది దానిని బ్రేక్ చేసింది. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా ఓడిపోవడం గమనార్హం. 2016లో దేశంలోనే ఈ టోర్నీని అత్యధికంగా 112 బిలియన్ నిమిషాలపాటు చూసినట్లు ఐసీసీ ప్రకటించింది.

ఇక గతంతో పోలిస్తే ఈసారి భారత్ –పాక్ మ్యాచ్ ను పాకిస్థాన్ లో 7.3 శాతం అధికంగా చూడగా… ఇంగ్లాండ్ లో 60 శాతం, ఆస్ట్రేలియాలో 175 శాతం ఎక్కువ మంది వీక్షించారు.


Tags:    

Similar News