చైనాకు కాలిపోయే మాట‌లు చెప్పిన యోగా గురువు

Update: 2017-08-13 12:32 GMT
గ‌డిచిన యాభై రోజులుగా సిక్కిం బోర్డరులో ఉన్న డోక్లామ్ వివాదం గురించి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో చైనాకు భార‌త్ ఇస్తున్న షాకుల‌కు ఆ దేశం కిందామీదా ప‌డుతూ మాట‌ల యుద్ధానికి తెర తీస్తోంది. గ‌డిచిన కొద్ది రోజులుగా చైనా ప్ర‌భుత్వం.. అక్క‌డ మీడియా భార‌త్ మీద నిప్పులు చెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. చైనా విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదే లేదంటూ భార‌త్ తీసుకున్న స్టాండ్‌కు అంత‌ర్జాతీయంగానూ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

ఇదిలా ఉంటే.. చైనాకు ఒళ్లు మండిపోయే బౌద్ధ‌గురువు ద‌లైలామాను ప‌క్క‌న పెట్టుకొని మ‌రీ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ముంబ‌యిలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ద‌లైలామా.. రాందేవ్ బాబా పాల్గొన్నారు. డోక్లాం వివాదం నేప‌థ్యంలో చైనాతో యుద్ధానికి భార‌త్ సిద్ధంగా ఉండాల‌ని సూచించ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌పంచ శాంతి స‌ద‌స్సుకు హాజ‌రైన బాబా రాందేవ్ యుద్ధం గురించి వ్యాఖ్య‌లు చేయ‌టం విశేషం. ఒక‌వేళ చైనాకు శాంతియుతంగా మెల‌గాల‌న్న ఉద్దేశ‌మే ఉండి ఉంటే.. ఈ రోజు ద‌లైలామా భార‌త్ లోఉండే వారు కాద‌న్నారు.

శాంతియుతంగా ఉండాల‌ని అనుకున్న ప్ర‌తిసారీ చైనా యుద్ధానికి ఉసిగొల్పుతుంద‌న్నారు. మ‌నం కూడా అదే రీతిలో బ‌దులివ్వాల‌ని సూచించిన రాందేవ్ బాబా.. వారు శాంతిని అర్థం చేసుకోక‌పోతే యుద్ధంతోనే స‌మాధానం ఇవ్వాల‌న్నారు. చైనా ఉత్ప‌త్తుల‌ను  తిర‌స్క‌రించాల‌ని.. భార‌తీయుల‌కు మ‌రోసారి సూచ‌న చేశారు. భార‌తీయుల‌మ‌నే భావ‌న క‌లిగిన‌వారు వెంట‌నే చైనా వ‌స్తువుల కొనుగోలును నిలిపివేయాల‌న్నారు. యోగా లాంటి శాంతియుత ప‌ద్ధ‌తుల్లో చెప్పేది అర్థం కాన‌ప్పుడు యుద్ధంతోనే స‌మాధానం ఇవ్వాల‌ని రాందేవ్ వ్యాఖ్యానించారు. రాందేవ్ బాబా మాట‌లు ఇప్ప‌డు సంచ‌ల‌నంగా మారాయి.
Tags:    

Similar News