తాలిబన్లతో ఇండియా చర్చలు - ఆయనకేంటి బాధ

Update: 2021-09-02 06:30 GMT
ఆప్ఘనిస్థాన్లో తాలిబన్లతో భారత రాయబారి దీపక్ మిట్టల్ చర్చలు జరపడం మంచి పరిణామమే. మామూలు పరిస్థితుల్లో అయితే ఏ దేశం కూడా అధికారికంగా తాలిబన్లతో చర్చలు జరపటానికి ఇష్టపడదు. కానీ ఇఫుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తాలిబన్లతో చర్చలు జరపాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే తాలిబన్ల బలపడే కొద్దీ అది భారత్ కు తీరని నష్టం చేస్తుంది.

తాలిబన్ల ప్రభావం, నష్టం మన దేశంపై పడకూడదంటే చర్చలు జరపడం ఒకటే మార్గం. అందుకనే ఖతార్ లోని భారత్ రాయబారి దీపక్ మిట్టల్ వారితో చర్చలు జరపాల్సొచ్చింది. అది కూడా తాలిబన్ల ఆహ్వానం ప్రకారమే దీపక్ వారితో చర్చలు జరిపారని గుర్తుంచుకోవాలి. దీన్నే జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చాలా పెద్ద విషయంగా చూస్తున్నారు. తాలిబన్లతో చర్చలు జరపటాన్ని నరేంద్రమోడి సర్కార్ చేసిన ఘోరమైన తప్పుగా మాట్లాడుతున్నారు.

తాలిబన్లు తీవ్రవాదులా కాదా తేల్చి చెప్పాలని ఒమర్ కేంద్రాన్ని డిమాండ్ చేయడమే ఆశ్చర్యంగా ఉంది. తాలిబన్లకు కేంద్రానికి మధ్య చర్చలు జరిగిన విషయంలో ఒమర్ తల దూర్చాల్సిన అవసరమే లేదు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సుంటుంది. ఇపుడు తాలిబన్లతో చర్చలు జరపడం కూడా ఇందులో భాగమే. ఆఫ్ఘన్ గడ్డపై భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దీపక్ తాలిబన్లను కోరటంలో తప్పేమీ లేదు.

తాము భారత్ వ్యతిరేక వైఖరి అవలంభించడం లేదని తాలిబన్లు చెప్పినా వాళ్ళని నమ్మేందుకు లేదు. ఎందుకంటే భారత్ లో తీవ్రవాదులు చేస్తున్న మారణహోమాలకు పాకిస్థాన్లోనే మూలాలుంటాయని ప్రపంచానికంతా తెలుసు. ఇపుడా పాకిస్ధాన్ తాలిబన్లకు మిత్రదేశమైపోయింది. మరి వీళ్ళద్దరు కలిస్తే భారత్ కు చాలా ఇబ్బందనే చెప్పాలి. తాలిబన్లకు భారత్ అంటే ప్రత్యేకమైన కోపం ఏమీ లేకపోయినా పాకిస్తాన్ కోసమని మన సరిహద్దుల్లోకి తీవ్రవాదులను పంపితే జరిగే నష్టం భారీగా ఉంటుంది.

దీన్ని నివారించడానికి కేంద్రం వ్యూహాత్మకంగా తాలిబన్లతో చర్చలు జరిపింది. ఈ విషయాలను పక్కన పెట్టేసి తాలిబన్ల విషయంలో కేంద్రం తన వైఖరిని ప్రకటించాలని, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలంటు అర్ధంలేని డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ-కాశ్మీర్లో రాజకీయంగా బీజేపీపై కోపముంటే ఒమర్ తీర్చుకోవడంలో తప్పులేదు. అంతేకానీ దేశ భద్రత విషయంలో కూడా కేంద్రాన్ని ఒమర్ ఇబ్బందుల్లోకి నెట్టేయాలని చూడటం దారుణం.


Tags:    

Similar News