ఏడేళ్ల‌లో చైనా జ‌నాభాను దాటేస్తామ‌ట‌!

Update: 2017-06-22 06:01 GMT
ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా చైనా ఇక ఎంతో కాలం నిల‌వ‌లేదు. ఎందుకంటే ఆ దేశ జ‌నాభాను భార‌త దేశ జ‌నాభా దాటేయ‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ట‌. మ‌రో ఏడేళ్ల‌లో చైనాను రెండో స్థానానికి నెట్టేయ‌నున్న భార‌త్‌... ఆ త‌ర్వాత ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా రికార్డు సృష్టించ‌నుంది. ఇదేదో గాలి వాటం మాట కాదు. ఐక్య‌రాజ్య‌స‌మితి ప‌క్కాగా లెక్క‌లేసి మ‌రి తేల్చిన అంశం. ఈ ఏడాది ప్ర‌పంచ జ‌నాభా గ‌ణాంకాల ప్ర‌కారం 1.41 బిలియ‌న్లతో చైనా జ‌నాభా ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా ఉంది. అదే స‌మ‌యంలో భార‌త్ కూడా 1.34 బిలియ‌న్ల‌తో ఈ జాబితాలో చైనా త‌ర్వాత రెండో స్థానంలో ఉంది.

అధిక జ‌నాభా వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను అవ‌గ‌తం చేసుకున్న చైనా... జ‌నాభా నియంత్ర‌ణ‌కు సంబంధించి ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాల‌నిచ్చిన నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఆ దేశ జ‌నాభా పెరుగుద‌ల నిర్దేశిత ప్ర‌మాణానికి ప‌డిపోయింది. అయితే అధిక జ‌నాభా వ‌ల్ల జ‌రిగే న‌ష్టాల‌ను బేరీజు వేయ‌డంలో మెరుగ్గానే రాణించిన భార‌త్‌... జ‌నాభా పెరుగుద‌ల నియంత్ర‌ణ‌లో మాత్రం అనుకున్నంత మేర స‌క్సెస్ కాలేదు. దీంతో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జానాభా క‌లిగిన రెండో దేశంగా రికార్డు పుస్త‌కాల్లో ఉంటూనే... జ‌నాభా పెరుగుద‌ల‌లోనూ వేగంగానే ముందుకు సాగుతోంది. వెర‌సి... మ‌రో ఏడేళ్ల‌లో చైనాను ఈ జాబితాలో కింద‌కు నెట్టేయనున్న భార‌త్‌...ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా కొత్త చ‌రిత్ర సృష్టించ‌నుంది. ప్ర‌పంచ జ‌నాభాలో ఇప్పుడు 19 శాతం మంది చైనాలో ఉంటే... భార‌త్‌లో 18 శాతం మంది ఉన్నారు. అంటే చైనా జ‌నాభాకు భార‌త్ జ‌నాభాకు మ‌ధ్య వ్య‌త్యాసం ఒక్క శాత‌మేన‌న్న మాట‌.

ఈ ఒక్క శాతాన్ని కూడా చెరిపేయ‌నున్న భార‌త్‌... 2024 నాటికి చైనా జనాభాతో స‌రిస‌మానంగా 1.44 బిలియ‌న్ల‌కు త‌న జ‌నాభాను పెంచుకోనుంది. అంటే 2024 నాటికి చైనా జ‌నాభా కేవ‌లం 0.03 బిలియ‌న్లు పెరుగుతుండ‌గా... అదే భార‌త్‌లో 1 బిలియ‌న్ మేర జ‌నాభా పెర‌గ‌నుంది. ఇక ఆ త‌ర్వాత కూడా భార‌త జ‌నాభా పెరుగుద‌ల ఏమాత్రం తేడా లేకుండానే పెరుగుంద‌ని ఐరాస అంచ‌నా వేసింది. ఇక జ‌నాభా నియంత్ర‌ణ‌లో మంచి ఫ‌లితాలు సాధించిన చైనా మాత్రం త‌న జ‌నాభాను పూర్తిగా కంట్రోల్‌లోనే ఉంచుకోనుంద‌ట‌. ఫ‌లితంగా చైనా జ‌నాభాను దాటేస్తూ భార‌త్‌... ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంలో చ‌రిత్ర పుట‌ల్లోకి ఎక్క‌నుంది. 1.34 బిలియ‌న్ల మంది ఉంటేనే... ఇప్పుడు దేశంలో నానా ఇబ్బందులు ఎదుర‌వుతుంటే... 1.44 బిలియ‌న్ల మార్కుకు జ‌నాభా చేరితో మ‌రింకెన్ని ఇబ్బందులు త‌లెత్తుతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News