యూపీనే కాదు.. పంజాబ్‌ లోనూ హంగేనా?

Update: 2016-10-14 09:26 GMT
మరి కొద్ది నెలల్లో రెండు కీలక రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవటం ద్వారా తమ అధిపత్యాన్ని తిరుగులేని రీతిలో చాటాలని బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీతో పాటు మిగిలిన పార్టీలు సైతం అంతే పట్టుదలగా ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు.. దేశంలోని సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన పంజాబ్ రాష్ట్రానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాయి. మరి.. ఆ రాష్ట్రాల్లో  ఏ పార్టీ అధికారం చేజిక్కించుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ సర్వేలు నిర్వహించటంలో పేరున్న ఇండియా టుడే మీడియా సంస్థ ఈ రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా సర్వే నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన సర్వే ఫలితాల్ని నిన్ననే ప్రకటించిన సంగతి తెలిసిందే. యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. అయితే.. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాదని తేల్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా పంజాబ్  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాము చేసిన సర్వే ఫలితాల్నిఆ సంస్థ‌ విడుదల చేసింది.

యాక్సిస్ తో కలిసి ఇండియా టుడే నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వెల్లడైన వివరాల్ని చూస్తే.. కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్లు తేల్చింది. అన్ని బాగుంటే ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 49 నుంచి 55 సీట్లు వచ్చే అవకాశం ఉందని.. అయితే.. మెజార్టీకి అవసరమైన ‘‘59’’ అసెంబ్లీ సీట్లను మాత్రం చేజిక్కించుకునే అవకాశం లేదని తేల్చింది. గత ఎన్నికలతో పోలిస్తే..  ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించినా.. మెజార్టీని మాత్రం సొంతం చేసుకోలేదని తేల్చింది.

ఇక.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి పంజాబ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సొంతం చేసుకునే అవకాశం ఉందని వెల్లడైంది. ఆ పార్టీకి తక్కువలో తక్కువ 40 సీట్లు పక్కా అని చెబుతోంది. సర్వే అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 42 నుంచి 46 సీట్లు వచ్చే అవకాశం ఉందని.. అదే సమయంలో అధికార అకాలీదళ్ – బీజేపీ కూటమి మాత్రం కేవలం 17 నుంచి 21 సీట్ల మధ్య పరిమితం అయ్యే అవకాశం ఉందని సర్వే తేల్చింది.

ఇతర పార్టీలు పెద్దగా ప్రభావితం చూపించే అవకాశం లేదని.. ఆ పార్టీలకు ఏడెనిమిది సీట్ల కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని తేల్చింది. ఇక.. బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ప్రముఖ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావితం చూపించలేరని ఈ స‌ర్వే తేల్చింది. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అకాలీదళ్ – బీజేపీ భారీగా నష్టపోనుందన్నట్లుగా సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ సర్వే కానీ వాస్తవమైతే.. బీజేపీ ఇమేజ్ కు భారీ నష్టం వాటిల్లినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News